రాజకీయ పరిపక్వత ప్రదర్శిస్తున్న కేజ్రీవాల్

 

ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చాలా రాజకీయ పరిపక్వత కనబడుతోందిపుడు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినపుడు ఏవయినా సమస్యలు ఎదురయితే ఒక సాధారణ ఉద్యమ నాయకుడులాగే రోడ్ల మీద ధర్నాలు చేసేవారు. కేంద్రప్రభుత్వం మీద అలిగి రాజీనామా చేసి తన ప్రభుత్వాన్ని తనే కూల్చుకొన్నారు. కానీ ఆవిధంగా చేయడం చాలా పొరపాటని నిజాయితీగా ప్రజల ముందు అంగీకరించి మళ్ళీ అటువంటి పొరపాట్లు చేయబోనని ప్రజలకు చెప్పగలగడం కేవలం ఆయనకే చెల్లునేమో? రాజకీయ నాయకులు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు. కానీ ఆయనలాగ నిజాయితీగా తన తప్పులను ప్రజల ముందు ఒప్పుకొనే సాహసం మరెవరూ చేయలేరనే చెప్పవచ్చును.

 

తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేసినపుడు కేజ్రీవాల్ మొదట కాస్త కంగారుపడినప్పటికీ అంతలోనే మళ్ళీ తేరుకొని ఒక పరిపక్వ రాజకీయ నాయకుడు ఏవిధంగా ప్రతిస్పందిస్తాడో సరిగ్గా అలాగే ఆయన కూడా ప్రతిస్పందించారు. ఇదే సంఘటన ఇదివరకు జరిగి ఉండి ఉంటే ఆయన తన మంత్రులతో కలిసి రోడ్డు మీద ధర్నాకు దిగి నవ్వులపాలయి ఉండేవారు. అందుకు కోర్టుల చేత కూడా మొట్టి కాయలు వేయించుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు డిల్లీ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తూ రాజకీయంగా ఎదుర్కోవడం చూస్తుంటే ఆయనకి రాజకీయ పరిణతి వచ్చినట్లు స్పష్టమవుతోంది.

 

ఆయన చేస్తున్న ఆరోపణలలో నిజానిజాలు ఇంకా నిరూపించబడవలసి ఉంది. కానీ ఆ ఆరోపణలు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి, కేంద్రప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారాయి. ఆమాద్మీ పార్టీ తిరుగులేని మెజార్టీతో డిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ తను ఒక్కడే బలమయిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కష్టమని ముందే గ్రహించి బిహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ కి మద్దతు ఇచ్చేరు. అలాగే మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చేతులు కలిపారు. తత్ఫలితంగా ఇప్పుడు వారిరువురూ కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి తెలియజేయకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా సచివాలయంలోకి సిబిఐ అధికారులు ప్రవేశించడాన్ని వారు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీపై యుద్ధం చేయడానికి ఎల్లప్పుడూ ఉత్సుకతతో ఉంటుంది కనుక ఈ వ్యవహారంలో అది కూడా అరవింద్ కేజ్రీవాల్ కి మద్దతుగా నిలబడి అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పిస్తోంది.

 

సిబిఐ అధికారులు తన ప్రధాన కార్యదర్శి కార్యాలయంపై దాడులు చేసినపుడు అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తగ్గి ఉండి ఉంటే పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవేమో? కానీ ఆయన చాలా తెలివిగా పావులు కదుపుతూ రాజకీయ పరిణతిని ప్రదర్శిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu