తెరాస 14 పార్టీలుగా మారుతుందా...బాబోయ్!

 

ఒక్క తెరాస పార్టీని చూసే తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ జడుసుకొంటున్నాయి. మరి ఏకంగా 14 తెరాస పార్టీలు ఏర్పడితే ఊహించడానికే భయం వేస్తుంది. కానీ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాత్రం మున్ముందు 14 తెరాస పార్టీలు ఆవిర్భావం తధ్యమని జోస్యం చెపుతున్నారు. కానీ అదెలాగ సాధ్యమంటే కేసీఆర్ ఉన్నంతవరకే తెరాస ఒక్కటిగా ఉంటుందని, ఆయన తప్పుకోగానే తెరాస 14 ముక్కలు అవుతుందని అన్నారు. తెరాస-కె (కవిత), తెరాస-హెచ్ (హరీష్ రావు), తెరాస కేటీఆర్ (కె.తారకరామావు), తెరాస-ఈ (ఈటెల రాజేందర్) ఇలాగ తెరాసలో నుండి 14 తెరాస ముక్కలు పుట్టుకొస్తాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణా ఉద్యమం కోసం పోరాడిన వారినందరినీ కేసీఆర్ పక్కనబెట్టి అసలు తెలంగాణా పేరు కూడా ఎత్తని తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలకి మంత్రి పదవులు ఇచ్చి చంకన ఎక్కించుకొన్నారని ఆయన విమర్శించారు.

 

ఆయన విమర్శల మాటెలాఉన్నా ఆయన చెప్పిన జోస్యంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ముగ్గురుకి మాత్రమే చాలా ప్రాధాన్యంఇస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కి స్వయాన మేనల్లుడయిన హరీష్ రావు ఈవిషయంలో కొంత అసంతృప్తితో ఉన్నట్లు అప్పుడప్పుడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ తన వారసుడిగా తన కుమారుడిని కానీ కుమార్తెని గానీ ప్రకటించినట్లయితే అప్పుడు హరీష్ రావు తదితరులు వేరు కుంపటి పెట్టుకొంటే ఆశ్చర్యం లేదు. ఈ సమస్య తెరాసకే కాదు అన్ని పార్టీలకు ఉన్నటువంటిదే. అధికారంలో ఉన్న పార్టీలపై మరి కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది అంతే. కనుక ఇటువంటి పరిస్థితి రాకుండా కేసీఆర్ ముందే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu