అతను ఎవరికీ అంతుపట్టడు...
posted on Aug 11, 2015 3:26PM
.jpg)
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. రాష్ట్ర విభజన జరుగుతుందని తెలియగానే తెలంగాణా నుండి ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయి సమైక్యాంధ్ర పోరాటం మొదలుపెట్టిన ఆపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్ర విభజనకు కారణమయిన తెరాసకు మద్దతు పలికారు. తెలంగాణా ప్రజల తరపున తెలంగాణా ప్రభుత్వంతో పోరాడుతామన్న వ్యక్తి మళ్ళీ అదే తెరాస ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఏవో కుంటిసాకులు చెప్పారు. నిన్న మొన్న వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడని ఆయన, రాహుల్ గాంధీ వచ్చి విమర్శించేసరికి హడావుడిగా డిల్లీ వెళ్లి ధర్నా చేశారు. అదే మాట కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం అన్నారు కూడా. అంటే బీజేపీతో ఇక దోస్తీ కుదిరే అవకాశాలు లేవని గ్రహించి రాహుల్ గాంధీ మాట విని డిల్లీ వెళ్లి ధర్నా చేసి మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం ద్వారా మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారేమో అని జనాలకి అనుమానం కలిగించారు.
కానీ ఏడాదిగా కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనని జగన్మోహన్ రెడ్డి డిల్లీలో చేసిన ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోనేందుకే తమ అధినేతని విమర్శించారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరరెడ్డి విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకే అతను డిల్లీ వెళ్లి ధర్నాచేసారని తెదేపా నేతలు అనుమానిస్తే, మోడీని ప్రసన్నం చేసుకొనేందుకే సోనియా గాంధీని విమర్శిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తను ప్రత్యేక హోదా కోసమే డిల్లీ వెళ్లి ధర్నా చేశానని చెప్పుకొంటున్నా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు వింటుంటే ఆయన దీక్షకు పరమార్ధం ఏమిటని అనుమానించవలసివస్తోంది. ఈవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరికీ అంతుపట్టని విధంగా వ్యవహరిస్తూ అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అందుకే అతనికి రాజకీయ పరిపక్వత లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారేమో?