గ్రామజ్యోతి వెనుక ఆ నీడలేమిటి?
posted on Aug 12, 2015 3:53PM

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న గ్రామజ్యోతి పధకం గురించి ఆయన తన పార్టీ నేతలకి, మంత్రులకి, చివరికి సర్పంచులకి కూడా చాలా క్లాస్ తీసుకొంటున్నారు. గ్రామాల స్వయం సంవృద్ది సాధించేందుకు నిర్దేశించిన పధకం కనుక నేరుగా గ్రామాలకే అన్ని హక్కులు, బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు ఆయన చెపుతున్నారు. గ్రామీణవ్యవహారాలు చూసే పంచాయితీ రాజ్ శాఖ నుండే దీనికి అవసరమయిన నిధులు, ఆదేశాలు వగైరా అన్నీ విడుదలవుతాయని సమాచారం. అంటే ఇంతవరకు పెత్తనం చేస్తున్న వ్యవసాయ శాఖ, ఆర్ధిక శాఖ, రెవెన్యూ శాఖ వంటి శాఖలకు ఈ పధకంలో వేలుపెట్టే అవకాశం ఉండదన్నమాట.
పంచాయితీ రాజ్ శాఖకి కేసీఆర్ కుమారుడు కె.తారక రామారావు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఎవరూ కూడా ఈ పధకం జోలికి వచ్చే సాహసం చేయలేరని స్పష్టం అవుతోంది. తెలంగాణాలో అధికారం అంతా ఆ ముగ్గురు నలుగురు వ్యక్తుల చేతిలోనే ఉందని ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మిగిలినవారందరూ నామ మాత్రంగానే మంత్రులుగా చెలామణి అవుతున్నారని బీజేపీ రాష్ట్ర విభజన అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాదిస్తున్నారు. కానీ ఆయన రాష్ట్రంలో అధికారం ముగ్గురు చేతిలో కాదు అంతా ఒక్కరి చేతిలోనే ఉందని వాదిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు సరిగ్గా ఇటువంటిదే ‘మన ఊరు-మన ప్రణాళిక’ అనే పధకం ప్రకటించారు. కానీ ఆ తరువాత దాని గురించి చప్పుడు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామజ్యోతిని వెలిగించి కొడుకు చేతిలో పెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.