పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన ఎన్టీఆర్!
posted on Jan 18, 2025 9:28AM
.webp)
నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ ఈ పేరు ఒక ఉత్సాహం. ఈ పేరు ఒక ఉద్వేగం. ఈ పేరు ఒక చరిత్ర. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ జనం హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహామనిషి. శనివారం (జనవరి 18) ఆయన వర్ధంతి. కృష్ణా నదీతీరాన జన్మించిన నందమూరి తారక రామా బాల్యం నుండీ శ్రమజీవి. కుటుంబానికి అండగా, పొరుగువారికి సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉండేవారు.
నటుడిగా అశేష ఆంధ్రుల ఆరాధ్య దైవం అయ్యారు. అగ్ర హీరోగా యమా బిజీగా ఉన్న సమయంలో కూడా ఎన్టీఆర్ సామాజిక బాద్యతను విడవ లేదు. దివిసీమ ఉప్పెన సృష్టించిన పెను విషాదం లో జోలె పట్టి సర్వసం కోల్పోయిన కుటుంబాల కోసం విరాళాలు సేకరించి ఆదుకున్నారు. 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించి రాజకీయాలలోకి ప్రవేశించారు. 9 నెలల్లో దశాబ్దాలు గా అధికారం లో ఉన్న పార్టీ నీ కూకటి వేళ్ళతో పెకిలించి చరిత్ర తిరగ రాశారు. పేదలకు రూ.2 రూపాయలకే బియ్యం అందించి ఎన్టీఆర్ పేదవాడి అన్నం ముద్దగా మారిపోయారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల సంక్షేమ పథకాలకూ ఎన్టీఆర్ పథకాలే ఆదర్శం.
జనం గుండెల్లో దైవ సమానుడిగా కొలువయ్యారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజల సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పని చేస్తూనే ఉంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీని జనం గుండెల్లో దాచుకున్నారు. దేశ రాజకీయాలలో సంక్షేమం కోణాన్ని ఆవిష్కరించింది ఎన్టీఆర్ అనడంలో సందేహం లేదు. వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాలలో పెద్ద పీట వేసిన వ్యక్తి ఎన్టీఆర్.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళులర్పించారు. సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు'అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని... తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ... ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి నందమూరి బాలకృష్ణ తెలుగువారిలో రాజకీయ చైతన్యం ఎన్టీఆర్ తోనే వచ్చిందని, నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ కు ఎన్టీఆరే సాటి అని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
.webp)