ఇద్దరు కీలక మావోయిస్టుల లొంగుబాటు
posted on Jul 15, 2025 10:36AM

మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినఆపరేషన్ కగార్ సత్ఫలితాలనే ఇస్తోందని అంటున్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ కారణంగా పలువురు మావోయిస్టులు పలు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. హతమైన నక్సల్స్ లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నారు. ఇక పోతే ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు సహా పెద్ద సంఖ్యలో నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మంగళవారం (జులై 16)న లొంగిపోనున్నారు.
తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న, బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ రామగుండం సీపీ ఎదుట లొంగిపోనున్నారు. వీరి లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బేనని పరిశీలకులు అంటున్నారు. ఆపరేషన్ కగార్ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగిపోయిన నక్సల్స్ కు ప్రభుత్వం పాతిక వేల రూపాయల తక్షణ సాయం, వైద్యం, పునరావాసం వంటివి కల్పిస్తున్నది.