ఒకే ఒక్కడు.. శకపురుషుడు
posted on Jan 18, 2025 9:04AM

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వంటి నేత ఆయన ఒక్కరే. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల స్వల్ప కాలానికే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్కడు.. శకపురుషుడు.. నందమూరి తారకరామారావు. 1982 మార్చి నెలాఖరులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయన 1983 జనవరి తొలి వారంలో జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ మహానాయకుడిగా రాణించిన అరుదైన వ్యక్తి ఎన్టీఆర్. శనివారం (జనవరి 19) ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఒక్క సారి ఎన్టీఆర్ ఒ జీవిత కథను క్లుప్తంగా గుర్తు చేసుకుందాం...
1923 మే 28న కృష్ణా జిల్లా పామర్రు తాలూకా నిమ్మకూరులో ఎన్టీ రామారావు జన్మించారు. తల్లితండ్రులు వెంకట్రామమ్మ, లక్ష్మయ్య చౌదరి. 1933లో విజయవాడ మునిసిపల్ హైస్కూల్‌లో చేరి, 1940లో స్కూల్ ఫైనల్ పాసయ్యారు. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియేట్ పాసయి, గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. 19వ ఏట బసవరామ తారకంను ఆయన వివాహం చేసుకున్నారు. ఆయనకు మొత్తం 11 మంది సంతానం. వారిలో ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు.
ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజుల నుంచే ఎన్టీఆర్ నాటకాల్లో వేషాలు వేస్తూ వచ్చారు. ఆశ్చర్యమేమంటే నాటకాల్లో ఆయన మొదటగా ధరించింది ఒక స్త్రీ పాత్ర. అది 'పలనాటి యుద్ధం' నాటకంలో నాయకురాలు నాగమ్మ పాత్ర. బీఏ చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లోనే అప్పటి అగ్ర సినీ దర్శకుల్లో ఒకరైన చిత్తజల్లు పుల్లయ్య నుంచి 'కీలుగుర్రం', 'వింధ్యరాణి' సినిమాల్లో నటించేందుకు కబురు వచ్చింది. చదువు మధ్యలో ఆగిపోతుందనే ఉద్దేశంతో ఆ ఆఫర్లను ఎన్టీఆర్ వద్దనేశారు.
1948లో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరి, కొద్ది రోజులే పనిచేశారు. ఆ ఉద్యోగం మానేసి సినిమా రంగంలో అడుగుపెట్టారు. దిగ్దర్శకుడు ఎల్వీ ప్రసాద్ రూపొందించిన 'మనదేశం' మూవీలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా సినిమాల్లో తన తొలి పాత్రను సునాయాసంగా పోషించారు. తర్వాత టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా ఏకఛత్రాధిపత్యం వహించి ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, పంచపాత్రాభినయం చేసి అనితరసాధ్యుడు అనిపించుకున్నారు. 1953లో సొంత నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్.ఎ.టి.) స్థాపించి, తొలిగా 'పిచ్చి పుల్లయ్య' మూవీని నిర్మించారు. 1961లో రూపొందించిన పౌరాణిక చిత్రం 'సీతారామ కల్యాణం'తో దర్శకుడిగా మారారు ఎన్టీఆర్. అందులో ప్రతినాయకుడైన రావణుడి పాత్రను ధరించారు. 1976లో హైదరాబాద్‌లో రామకృష్ణా స్టూడియోస్ నిర్మించారు.
కేవలం సినీ జీవితానికే పరిమితం కాకుండా ప్రజా జీవితంతోనూ అనుబంధం ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్. 1952లో రాయలసీమ క్షామనిధి, 1964లో ముఖ్యమంత్రి సహాయనిధి, 1965లో జవానుల సంక్షేమనిధి, దేశరక్షణ నిధి, 1969లో కోస్తా ప్రాంత తుఫాను నిధికి భారీ విరాళాలు ఇచ్చిన ఆయన, 1977లో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి భిక్షాటన చేసి దివిసీమ ఉప్పెన బాధితుల సహాయనిధికి విరాళాలు సేకరించారు. 1964లోనే ఎన్టీఆర్ ధర్మనిధిని ఆయన ఏర్పాటు చేశారు. నిజానికి తెలుగు భాషకూ, తెలుగువాడికీ దేశీయంగా గుర్తింపు తీసుకురావడమే కాకుండా కాంగ్రెసేతర పార్టీలతో కలిసి కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు.
1982 మార్చి 29న సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయన 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తొలి నాయకుడిగా సరికొత్త చరిత్రను లిఖించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర తెలిసిందే. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి, తనను పదవీచ్యుతుడిని చేస్తే, ప్రజాబలంతో తిరిగి ఎలా ముఖ్యమంత్రి అయ్యిందీ తెలిసిందే . 1996 జనవరి18న తన 72 ఏళ్ల వయసులో తన నివాసంలోనే తుది శ్వాస విడిచి మహాభినిష్క్రమణం చేశారు. అటు సినిమా స్టార్‌గా, ఇటు పొలిటికల్ స్టార్‌గా ప్రజలను సమ్మోహితులను చేసి, ఆయనలా వారిని ప్రభావితం చేసిన మరో నాయకుడిని తెలుగువాళ్లు ఆయనకు ముందు చూడలేదు, ఆయన తర్వాతా చూడలేదు. ఇక చూసే అవకాశం కూడా లేదు.