ఉద్యోగుల గర్జన.. నిధులు స్వాహా... మరో గండం.. బస్సు బాదుడు.. టాప్ న్యూస్@7PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి  సీఎస్ సమీర్ శర్మకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు నోటీస్ ఇచ్చారు. జేఏసీ నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసులు ఈ నోటీస్‌ను సీఎస్ కు అందించారు. 11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు షెడ్యూల్‌ వంటి డిమాండ్లు అందులో ఉన్నాయి.-----ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ నిధులు రూ. 400 కోట్లను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌లోకి మార్చిన వీసీ చర్యను వ్యతిరేకిస్తూ వర్శిటీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. యూనివర్శిటీని మరింత అభివృద్ధి చేయాల్సిన అధికారులే... దెబ్బ కొడుతున్నారని, నిబంధనలు పట్టించుకోకుండా వీసీ.. ఏకపక్షంగా రూ. 400 కోట్లు బదలాయించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వీసీకి నిధులు మళ్లించే అధికారం లేదన్నారు. -----
గుంటూరు జిల్లా దాచేపల్లిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వడ్డెర కార్మికులపై రాజకీయ వివక్ష చూపించారు. ఇటీవల జరిగిన దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారన్న కక్షతో 70 వడ్డెర కుటుంబాలను బహిష్కరించారు. క్వారీల్లోకి వస్తే చంపేస్తామంటూ బెదిరించారు. తామంతా క్వారీల్లో పని చేసుకుంటున్నామని వడ్డెర సొసైటీ పేరుతో వైసీపీ నేతలు క్వారీయింగ్ చేస్తున్నారని కార్మికులు మండిపడ్డారు.
------
తిరుమల రెండవ ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. 14వ కిలోమీటరు వద్ద పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అటువైపు ఎలాంటి వాహన రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడడంతో రోడ్డు కుంగిపోయింది. దీంతో టీటీడీ అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్‌లోనే రాకపోకలు కొనసాగుతున్నాయి. 
----
వాతావరణ శాఖ ఏపీలో రాగల మూడ్రోజులకు వర్ష సూచన చేసింది. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది
---
కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లోక్ సభలో నేడు ధాన్యం సేకరణ అంశంపై వివరణ ఇచ్చారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ.... 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని వెల్లడించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, తెలంగాణ  నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని తెలిపారు.
--
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పట్టించుకోకుండా... నష్టాల పేరుతో పేదవాడి జేబుకు చిల్లు పెడుతూ ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు.
-----
గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ బృందం భేటీ అయింది. ధాన్యం సేకరణ, రైతు సమస్యలపై బృందం వినతిపత్రం అందజేసింది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతు సమస్యలను గవర్నర్‌కు విన్నవించామని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను కలవాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఇప్పటికే 70% ధాన్యం మిల్లర్లకు వెళ్ళిపోయాయన్నారు. పదమూడు, పద్నాలుగు వందల రూపాయలకు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేశారన్నారు. 
---
బస్సు చార్జీలను పెంచాలని డిసైడ్ అయింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. పల్లె వెలుగులో కిలోమీటర్ కు 25 పైసలు, ఎక్స్ ప్రెస్ తో పాటు ఇతర సర్వీసుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది టీఎస్ ఆర్టీసీ.డీజిల్ పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని చెప్పారు టీఎస్ ఆర్టీసీ ఎంసీ సజ్జనార్. 
----
లెజండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. ఆచార సంప్రదాయాల ప్రకారం ఆయన భౌతికకాయాన్ని దహనం చేశారు. సిరివెన్నెలకు కడసారి నివాళి అర్పించేందుకు తెలుగు సినీ ప్రముఖులంతా తరలివచ్చారు.
----------