ఏపీకి వార్నింగ్‌.. ఓటీఎస్‌తో టోక‌రా.. ఒట్టేసిన జ‌గ‌న‌న్న‌.. టాప్‌న్యూస్ @ 7pm

1. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం కుదరదని ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం తేల్చిచెప్పింది. కేంద్ర పథకాలను జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లకు లెక్క చూపాలని కేంద్రం ఆదేశించింది. ఎంపీ రఘురామ ఫిర్యాదుపై ఈ మేర‌కు కేంద్రం స్పందించింది.

2. ఏపీ ప్రజలు నవరత్నాలను నమ్మి.. నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు చంద్ర‌బాబు. ఎప్పుడో ఎన్టీఆర్ కట్టించిన ఇంటికి.. ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాక్షస జాతిలా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. 

3. ఓటీఎస్ పేరుతో డ్వాక్రా మహిళలకు జగనన్న టోకరా వేస్తున్నాడని టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ అవుతున్నాయన్నారు. జగన్‌రెడ్డి కబంధహస్తాల్లో అభయహస్తం చిక్కిందని లోకేష్‌ ఆరోపించారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఎవరూ కట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందని లోకేష్‌ ప్రకటించారు. 

4. సీఎం జగన్‌ను టీటీడీ కాంట్రాక్ట్ కార్మికురాలు రాధా కలిశారు. టీటీడీ కార్మికుల సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారు. తలమీద చేయిపెట్టి ఒట్టేయాలని సీఎంను రాధా కోరారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తానని రాధా తల మీద చేయిపెట్టి జగన్‌ ఒట్టేశారు. 

5. ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చేపట్టారు. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు జగన్ కోరారు. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరారు. హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది సీబీఐ కోర్టు నిరాకరించింది.  సీబీఐ వాదనల కోసం విచారణ ఈనెల 6కి హైకోర్టు వాయిదా వేసింది.

6. డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న.. ప్రభుత్వ నిబంధనను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీని కన్వీనర్‌ చూస్తారనే నిబంధనను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని కోర్టు ఆదేశించింది. 

7. వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని రైతులు నిరీక్షణ చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతున్నాయన్నారు. యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకెంత మంది రైతులు చస్తే తమ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ అని ప్రశ్నించారు. 

8. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం రేపింది. ఒక్కరోజే ఏడుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను జినోమ్ సీక్వేన్స్‌కు అధికారులు పంపించారు. ఇప్పటివరకు 12 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్దారణ అయింది. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 

9. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కరోనా సోకిన ప్రయాణికురాలు పరార్ అయింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపు ఎయిర్‌పోర్ట్‌ నుంచి పరారైంది. పాస్‌పోర్ట్‌ ఆధారంగా చిరునామా గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటి నుంచి కూడా ఆమె త‌ప్పించుకుంది. చివరకు ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకుని టిమ్స్‌ ఆస్పత్రికి అధికారులు తరలించారు. 

10. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతుఫానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో , ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో 'జవాద్' తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. శ‌నివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుంది.