10 రోజుల్లో పీఆర్సీ.. తెలీద‌న్న‌ జేఏసీ.. మ‌రి, మిగ‌తా డిమాండ్లు?

పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల డిమాండ్ కాదు.. ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి.. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ నిధులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ లాంటి అనేక సమస్యలు ఉన్నాయి.. అంటూ 10 రోజుల్లో పీఆర్సీ అంటూ తిరుపతిలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. పీఆర్సీకి సంబంధించి సీఎం చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాల‌కు సమాచారం లేదన్నారు ఏపీ జేఏసీ అమ‌రావ‌తి అధ్య‌క్షుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు. తిరుపతిలో తమ సంఘాలకు చెందిన ఉద్యోగులెవరూ సీఎంను కలవలేదని స్పష్టం చేశారు. 

పీఆర్సీ సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చలకు మాత్రమే ప్రభుత్వం పిలిచిందని బొప్ప‌రాజు వెల్లడించారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తేనే దానిపై చర్చించేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే ఉద్యమాన్ని విరమించుకుంటామని.. లేదంటే ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుందని బొప్పరాజు తేల్చి చెప్పారు.  

ఉద్యోగుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పీఆర్సీ విషయంలో శుక్ర‌వారం ఉద‌యం సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన సీఎం ఉద్యోగులను పిలిచి మాట్లాడారు. పీఆర్సీతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ముఖ్య‌మంత్రిని కోరారు. స్పందించిన జగన్‌.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. పది రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే, అధికారికంగా త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీఆర్సీ ఇచ్చినంత మాత్రాన స‌మ‌స్య‌లు తీరిపోవ‌ని.. మిగ‌తా డిమాండ్ల‌నూ నెర‌వేర్చాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి.