శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

 

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారని తెలిపారు.

సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకాదశిపై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించామన్నారు. భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించామన్నారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిన్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించామని తెలిపారు.

టోకెన్ పొందిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శనానికి రావాలి

ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయాన్ని కేటాయించడం జరిగిందని, ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు.టోకెన్ పొందలేని భక్తులకు చివరి ఏడు రోజుల్లో సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఈ-డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ-డిప్ విధానంలో టోకెన్లు కేటాయించామని, చివరి ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu