కేసీఆర్‌కు షాక్... నోటీసులు ఇవ్వనున్న సిట్?
posted on Dec 23, 2025 10:05AM
.webp)
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయమైన సమాచారం. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వాలనే అంశంపై సిట్ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ వ్యవహారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో చేపట్టారన్న దానిపై సిట్ దృష్టి కేంద్రీకరించింది.
ముఖ్యంగా రాజకీయ నాయకులు, కీలక వ్యక్తుల ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారా? అన్న కోణంలో లోతైన విచారణ కొనసాగుతోంది. అలాగే, ఈ అక్రమ ఫోన్ టాపింగ్ చర్యలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయన్న అంశంపై సిట్ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం... ఇప్పటికే సుప్రీంకోర్టు అనుమతితో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ను సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు లోకి తెస్తున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. విచారణ సమయంలో ప్రభాకర్ రావు పదే పదే మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావిస్తున్నారని తెలు స్తోంది. ఇప్పటికే సిట్ అధికారులు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని విచారణ చేసి అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఉన్నతాధి కారులు, రాజకీయ నేతల పాత్రపై సిట్ దర్యాప్తు విస్తరించినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటు న్నాయి. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఫోన్ టాపింగ్ కేసు మరింత ఉత్కంఠభరితంగా మారనుందని రాజకీయ, న్యాయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు అసెంబ్లీ సెషన్స్ తర్వాత హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ నోటీసులు ఇవ్వనుంది.