హెచ్ -1బీ ఉద్యోగులకు గూగుల్ సంస్థ గుడ్ న్యూస్
posted on Dec 23, 2025 2:27PM

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం వేచి చూస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు గూగుల్ ముందస్తు 'న్యూ ఇయర్' గిఫ్ట్ ఇచ్చింది. 2023లో లేఆఫ్స్ కారణంగా నిలిపివేసిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను 2026 నుంచి మళ్లీ పట్టాలెక్కించనున్నట్లు కంపెనీ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ అవకాశం అందరికీ వర్తించదు. కేవలం ఆఫీసు నుంచి పనిచేసే వారికి, మెరుగైన పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఉన్నవారికే గూగుల్ ప్రాధాన్యత ఇవ్వనుంది.
ఆ క్రమంలో అమెరికాలోని టెక్ దిగ్గజం గూగుల్‌లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. గత రెండేళ్లుగా నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను 2026 నుంచి భారీ ఎత్తున తిరిగి ప్రారంభించనున్నట్లు కంపెనీ తన అంతర్గత వర్గాల ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు డిసెంబర్ నెలలో ఉద్యోగులకు పంపిన న్యూస్ లెటర్‌లో కంపెనీ తన ప్రణాళికలను వివరించింది.
అమెరికాలో విదేశీ ఉద్యోగి శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్ కార్డ్ పొందాలంటే.. ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రీవ్యూ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత కీలకమైనది. దీని ద్వారా కంపెనీలు సదరు ఉద్యోగి చేసే పనికి తగిన అమెరికన్ అభ్యర్థులు అందుబాటులో లేరని ప్రభుత్వం ముందు నిరూపించాల్సి ఉంటుంది. 2023 జనవరిలో గూగుల్ సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించిన సమయంలో.. నియమ నిబంధనల దృష్ట్యా ఈ ప్రక్రియను నిలిపివేసింది. అమేజాన్, మెటా వంటి సంస్థలు కూడా అదే దారిలో వెళ్లడంతో వేలాది మంది టెక్కీలు గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసుకోలేక అనిశ్చితిలో పడిపోయారు.
అయితే 2026 మొదటి త్రైమాసికం నుంచి గూగుల్ నియమించుకున్న న్యాయ సంస్థలు అర్హులైన ఉద్యోగులను సంప్రదించడం ప్రారంభిస్తాయి. 2026 ఏడాది పొడవునా పీఈఆర్‌ఎమ్ దరఖాస్తులను పెంచుకుంటూ వెళ్లాలని గూగుల్ భావిస్తోంది. అయితే ఈ ప్రక్రియకు గూగుల్ కొన్ని కఠినమైన నిబంధనలను కూడా విధించింది. ముఖ్యంగా గూగుల్ ఉద్యోగులు అందరికీ ఈ స్పాన్సర్‌షిప్ లభించదు. పీఈఆర్‌ఎమ్ కావాలనుకునే వారు కచ్చితంగా గూగుల్ కార్యాలయం నుంచే పనిచేయాలి.
ప్రస్తుతం రిమోట్ లో ఉన్నవారు గ్రీన్ కార్డ్ ప్రక్రియ కోసం ఆఫీసు ఉన్న ప్రాంతానికి తరలి రావాల్సి ఉంటుంది. అలాగే సదరు ఉద్యోగి కచ్చితంగా ఒక ప్రత్యేక డిగ్రీ, పని అనుభవం ఉన్న ధృవీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా లెవల్-3, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి అవకాశం తక్కువని కూడా కంపెనీ పేర్కొంది. అలాగే వార్షిక సమీక్షలో 'మోడరేట్ ఇంపాక్ట్' లేదా అంతకంటే మెరుగైన రేటింగ్ పొందిన వారికి మాత్రమే స్పాన్సర్‌షిప్ లభిస్తుంది.
అలాగే కంపెనీలో మంచి పనితీరు కనబరిచే వారికే ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవలి కాలంలో వీసా ఫీజులు పెరగడం, ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వంటి కారణాలతో అమెరికాలోని భారతీయ టెక్కీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గూగుల్ కూడా తన ఉద్యోగులను అనవసరంగా దేశం దాటి వెళ్లవద్దని.. వీసా స్టాంపింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. గూగుల్ గ్రీన్ కార్డ్ ప్రక్రియను మళ్లీ పట్టాలెక్కించడం వేలాది మంది భారతీయ కుటుంబాలకు పెద్ద ఉపశమనం కానుంది.