యూకేని వీడుతున్న భారతీయ డాక్టర్లు, నర్సులు ఎందుకంటే?

 

దశాబ్దాల కాలంగా భారతీయ డాక్టర్లకు కలల గమ్యస్థానంగా ఉన్న బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్  ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. నైపుణ్యం కలిగిన భారతీయ వైద్యులు, నర్సులు ఇప్పుడు యూకేను వీడి స్వదేశానికి చేరుకుంటున్నారు. మరికొందరు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే వీరంతా యూకేను వీడడానికి భారీగా పెరిగిన పన్నులు, ఆకాశాన్ని అంటుతున్న జీవన వ్యయం, కఠినతరమైన వీసా నిబంధనలేనని తెలుస్తోంది. 

దశాబ్దాలుగా భారతీయ వైద్యులు, నర్సులకు అత్యంత ఇష్టమైన విదేశీ గమ్యస్థానంగా ఉన్న బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ .. ఇప్పుడు తన ఆకర్షణను కోల్పోతోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య వ్యవస్థగా పేరొందిన బ్రిటన్ నుంచి భారతీయ వైద్యులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో నిష్క్రమిస్తున్నారు. కేవలం వైద్య వృత్తిపై అసంతృప్తితోనే కాకుండా.. పెరిగిన ఆర్థిక భారం, కఠినమైన వలస నిబంధనలు, భవిష్యత్తుపై అనిశ్చితి వీరిని ఈ నిర్ణయం వైపు పురికొల్పుతున్నాయి.

 బ్రిటన్ పార్లమెంటులో ఇటీవల సమర్పించిన గణాంకాల ప్రకారం.. భారతీయులకు జారీ చేసే 'హెల్త్ అండ్ కేర్ వర్కర్' వీసాల సంఖ్య భారీగా తగ్గింది. భారతీయ జాతీయులకు ఇచ్చే వీసాలు ఏకంగా 67 శాతం పడిపోగా.. నర్సులకు ఇచ్చే వీసాల్లో 79 శాతం క్షీణత నమోదైంది. దీనిని బట్టి భారతీయ వైద్య నిపుణులు యూకే కంటే ఇతర దేశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం అవుతోంది. భారతీయ వైద్యులు యూకేను వీడటానికి ప్రధాన కారణం ఆర్థిక ఒత్తిడిగా తెలుస్తోంది. 

ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేసే సీనియర్ కన్సల్టెంట్లు తమ ఆదాయంలో 45 శాతం ఆదాయపు పన్నుగా, మరో 2 శాతం నేషనల్ ఇన్సూరెన్స్‌గా చెల్లించాల్సి వస్తోంది. వీటికి తోడు పెన్షన్ పథకం కోసం మరో 12.5 శాతం వెచ్చించాలి. ఇక జూనియర్ డాక్టర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆకాశాన్ని అంటుతున్న గృహ అద్దెలు, జీవన వ్యయంతో పోలిస్తే వారు పొందుతున్న జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజయ్ నారాయణ్ అభిప్రాయ పడ్డారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా భారతీయ వైద్యులకు డిమాండ్ పెరగడంతో వారు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ దేశాలు మెరుగైన జీతాలతో పాటు తక్కువ పన్నులు, సులభతరమైన పౌరసత్వ నిబంధనలను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు బ్రిటన్ ప్రభుత్వం నికర వలసలను తగ్గించాలనే లక్ష్యంతో నిబంధనలను కఠినతరం చేస్తోంది. నైపుణ్యం కలిగిన విదేశీ వర్కర్లపై ఈ విధానాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. 

ఒకప్పుడు వైద్యులకు కొరత ఉన్న ఎన్‌హెచ్‌ఎస్‌లో ఇప్పుడు పోటీ పెరిగింది. ఒక్కో పోస్టుకు వందలాది దరఖాస్తులు వస్తున్నాయి. విదేశీ వైద్యులకు తప్పనిసరి అయిన పి.ఎల్.ఎ.బి  పరీక్షల సంఖ్యను కూడా తగ్గించాలని నిబంధనలు మారుతున్నాయి. ఈ పరీక్షలు అత్యంత ఖరీదైనవి కావడంతో పాటు ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగ భరోసా లేకపోవడం టెక్కీలను నిరాశకు గురిచేస్తోంది. 

1948లో ఎన్‌హెచ్‌ఎస్ స్థాపించబడినప్పటి నుంచి భారతీయ వైద్యులు ఆ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఎస్ సిబ్బందిలో 13 శాతం మంది ఆసియా సంతతికి చెందిన వారే ఉన్నారు. అయితే కొవిడ్ తర్వాత ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్టులు ఖర్చులను తగ్గిస్తున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాల వల్ల భవిష్యత్తులో బ్రిటన్ వైద్య రంగంలో భారతీయుల భాగస్వామ్యం మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu