వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకోవాలి..!

 

వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కీలకమైన దశ.  ఈ దశలో చాలామంది జీవితాలు మారిపోతుంటాయి. ఈ కాలంలో వివాహం తర్వాత జీవితం ప్రశాంతంగా లేదని చెప్పేవారే ఎక్కువ.  కొందరైతే ఏకంగా విడాకుల వరకు గొడవలను తీసుకువెళుతుంటారు.  మరికొందరు కేసులు, కోర్టులు అంటూ సమస్యలు పెద్దవి చేసుకుంటారు. ఇలాంటి వాటికి ఆచార్య చాణక్యుడు సరైన సలహాలు, సూచనలు ఇచ్చారు. చాణక్యుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని వాటిని పాటిస్తుంటే వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుందట. ఇంతకీ ఇందుకోసం ఏం చేయాలంటే..

ప్రేమ, నిజాయితీ..

ఒక బంధం విజయవంతంగా ఉండాలన్నా,  ఆ బంధం బలంగా మారాలన్నా ఆ బంధంలో ఉన్న వ్యక్తుల మధ్య ప్రేమ, నిజాయితీ ఉండాలి. నిజమైన ప్రేమ, నిజాయితీతో కూడిన ప్రవర్తన బంధాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.  వివాహ బంధంలో ఉన్ వ్యక్తి తన జీవిత భాగస్వామితో ప్రేమగా, నిజాయితీగా ఉంటూ.. జరిగే తప్పొప్పులు,  వచ్చే సమస్యలను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటే జీవితంలో ఒకరిమీద ఒకరికి నమ్మకం బలపడుతుంది.  

అహం..

మనిషి జీవితంలో ఏ బంధంలో అయినా అహం అనేది పెద్ద శత్రువుగా మారుతుంది.  ఇది భార్యాభర్తల మధ్య సంబంధం అయితే ఈ అహం అనేది చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది.  బంధంలో చీలికలు సృష్టించడానికి కారణం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం అనేవి లేకుండా చేయడంలో అహం ప్రధాన శత్రువు అవుతుంది. వైవాహిక బంధంలో అహంను పక్కన పెట్టి ఒకరి పట్ల మరొకరు ప్రేమతో, గౌరవంతో ఉండాలి.  ఇలా ఉంటే ఇద్దరు దూరమయ్యే పరిస్థితులే రావు.

నిజం..

వైవాహిక బంధంలో నిజం మాట్లాడటం, నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తలు నిజంగా, నిజాయితీగా మాట్లాడితే వారిద్దరూ ఒకరి మీద మరొకరు  గౌరవం కలిగి ఉంటారు. వారి అపార్థాలు కూడా తలెత్తవు. ఎప్పుడూ నిజం మాట్లాడే వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  ఎలాంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కుంటారు.

గౌరవం..

నేటి కాలంలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకోవడం, పురుషహంకారం చూపించడం వంటివి చేయడం వల్ల బంధం చెడిపోతుంది.  భార్యాభర్తలు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవాలి.  భర్త భార్యను బానిసలాను, పని మనిషిలాను ట్రీట్ చేయడం,  తన అధికారాన్ని భార్య మీద చూపడం వంటివి చేయకూడదు. భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ పదిమంది ముందు దోషిగా నిలబెట్టి అవమానించడం మానుకోవాలి.  ఇలా అవమానిస్తే అది సంబంధంలో చీలిక ఏర్పడటానికి దారితీస్తుంది.

కమ్యూనికేషన్..

భార్యాభర్తలు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇద్దరూ ఎదురుగా  ఉన్నప్పుడు కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోవాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ  సమస్యలను,  తమ ఆలోచనలను, భావాలను, తాము చేయాలనుకున్న పనులను  స్నేహపూరితంగా వివరించి చెప్పాలి.  మాటల్లో ఎలాంటి అపార్థాలు లేకుండా వివరించాలి.  అదే విధంగా భాగస్వామి ప్రతిస్పందనను కూడా అంతే స్నేహపూరితంగా తీసుకోవాలి.  ఇలా ఉంటే భార్యాభర్తలు మాట్లాడుకునే సందర్భాలలో ఎప్పుడూ గొడవలు రావు.

                                            *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu