9/11 దాడి ఇంకా పూర్తవ్వలేదు

 

2001, సెప్టెంబరు 11. అల్‌ఖైదా ఉగ్రవాదులు రెండు బోయింగ్‌ విమానాల సాయంతో అమెరికాలోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేశారు. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులతో సహా 2,700కి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జరిగి నిన్నటికి 15 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ వేల మంది ఆరోగ్యాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే...

 

 

విష వాతావరణం

రెండు భారీ విమానాలు అంతకంటే భారీగా ఉన్న భవనాలను కూల్చివేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విస్ఫోటనంలో విమానంలోని ఇంధనం మొదలుకొని, భవన నిర్మాణంలో ఉపయోగించిన యాస్బెట్సాస్ వంటి హానికారక పదార్థాలు ఎన్నో ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. భవనంలో ప్లాస్టిక్‌ మొదలుకొని మానవ విసర్జితాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. అక్కడ ఉన్న యంత్రాలు, పరికరాలు తగలబడిపోవడంతో మెర్క్యురీ, లెడ్ వంటి విషపదార్థాలతో ఆ ప్రాంతం నిండిపోయింది.

 

 

తప్పుడు నిర్ణయం

ట్విన్‌ టవర్స్‌ని కూల్చివేడం ద్వారా అల్‌ఖైదా అమెరికాను దారుణంగా దెబ్బతీసినట్లు అయ్యింది. కానీ తమ పౌరుల స్థైర్యం ఇంకా చెక్కుచెదరలేదన్న సంకేతాలను అమెరికా పెద్దలు చెప్పాలనుకున్నారు. అందుకనే ట్విన్ టవర్స్‌ చుట్టుపక్కల ప్రదేశంలోని గాలి, నీరు ఇంకా సురక్షితంగానే ఉన్నాయనీ... పౌరులంతా అక్కడే ఉండి తమ రోజువారీ జీవితాన్ని కొనసాగించవచ్చనీ ఊదరగొట్టారు. దాంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు కూడా అక్కడే ఉండిపోయారు. ఆ కాలుష్యంలోనే తమ జీవితాలను గడపసాగారు.

 

 

అనారోగ్యాలు మొదలు

ఏళ్లు గడిచేకొద్దీ అక్కడి ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా విస్ఫోటనం తరువాత ట్విన్‌ టవర్స్ చుట్టుపక్కల నివసించిన ప్రజలు, అక్కడి ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికులలో ఒకొక్కటిగా రోగాలు బయటపడసాగాయి. ఆస్తమా, ఊపిరితిత్తులు పాడైపోవడం, డిప్రెషన్‌, నిద్రలేమి మొదలుకొని క్యాన్సర్‌ వరకూ రకరకాల జబ్బులు పీడించసాగాయి.

 

ఉచిత వైద్యం

9/11 కాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డవారికి చికిత్సను అందించేందుకు 2012లో World Trade Center Health Program పేర ప్రభుత్వం ఒక ఆరోగ్య పథాకాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ కాలుష్యానికి బాధితులుగా ఉన్నవారంతా ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. ఈ పథకం కింద ఏకంగా 75 వేల మంది ప్రజలు చేరారంటే, 9/11 కాలుష్యం ఎంతమందిని ప్రభావితం చేసిందో ఊహించుకోవచ్చు. అయితే ఈ లెక్క చాలా తక్కువని వాదించేవారూ లేకపోలేదు. 9/11 ఘటన జరిగిన తరువాత కొంతమంది అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారనీ, మరికొందరికి అసలు ఈ పథకం గురించే తెలియదనీ చెబుతున్నారు. పైగా క్యాన్సర్‌ వంటి రోగాలు బయటపడటానికి ఒకోసారి 20 సంవత్సరాల వరకూ సమయం పడుతుంది. కాబట్టి మున్ముందు కాలంలో 9/11 బాధితుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు. అలా ఉగ్రవాదుల పైశాచికత్వానికి, ప్రభుత్వాల తప్పిదాలు కూడా తోడవ్వడంతో 9/11 భూతం ఇంకా న్యూయార్కు వాసులను వెన్నాడుతూనే ఉంది.

 

- నిర్జర.