వారెవ్వా మందారం టీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!


మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..

మందారం టీ..

మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు.

మందారం టీ బెనిఫిట్స్..

మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు..

మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

బరువు తగ్గడంలో..

మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కాలేయం..

మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.

                       
మందారం టీ తయారు విధానం..

మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

మందారం రెక్కలు.. గుప్పెడు
నిమ్మకాయ..  సగం చెక్క
తేనె.. స్పూన్
నీరు.. ఒక గ్లాస్

తయారీ విధానం..

ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.

                                     *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu