తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
posted on Jul 10, 2025 8:33AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (జులై 9) శ్రీవారిని మొత్తం 76 వేల 501 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 33 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది.
ఇలా ఉండగా తిరుమలలో బిగ్, జనతా క్యాంటీన్ల ఏర్పాటుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరమలలో హోటళ్లు, క్యాంటీన్ల నిర్వాహకులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మిన్ భవనంలో ఈ సమావేశం జరిగింది.
తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్ల నిర్వహణ కోసం గత నెల 23న టీటీడీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే తిరుమలలో గుర్తింపు పొందిన హోటళ్లు, క్యాంటిన్ల నిర్వాహకులతో టీటీడీ ప్రిబిడ్ మీటింగ్ నిర్వహించింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని ఈ సందర్భంగా టీటీడీ ఈవో, ఏఈవోలు ఆదేశించారు. భక్తులకు లాభాపేక్ష లేకుండా, సేవా దృక్ఫథంతో నిర్దేశిత ధరలకే నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు.