వర్మపై పిఠాపురం జనసేన క్యాడర్ గుర్రు.. కారణమేంటంటే?
posted on Jan 20, 2025 2:15PM

పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కాయా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఈ విభేదాలకు కారణం తెలుగుదేశం నాయకుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎస్ వర్మ వ్యాఖ్యలే కారణమా అంటే జనసైనికులు ఔనని అంటున్నారు. అదే సమయంలో వర్మ వ్యాఖ్యలలో తప్పేముందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారంటే.. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని గట్టిగా కోరుకుంటే అదే జరుగుతుంది? అందులో తప్పేముందని అన్నారు.
అసలు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం క్యాడరే కాదు సీనియర్ నేతలు కూడా బాహాటంగానే కోరుతున్నారు. ఆయన ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనీ, ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల పార్టీ కూడా బలోపేతమౌతుందని గట్టిగా చెబుతున్నారు.
ఇటీవల మైదుకూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీనులైన సభావేదికపై నుంచే తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అక్కడితో ఆగకుండా ఇది తన ఒక్కడి అభిప్రాయమే కాదనీ, టీడీపీ క్యాడర్ అభిప్రాయమనీ విస్పష్టంగా చెప్పారు. ఆ తరువాత ఒక్కరొక్కరుగా నాయకులు కూడా అదే విషయాన్నిబాహాటంగా వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసిన వారిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక పార్టీ కార్యకర్తలైతే లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ ను చాలా చాలా గట్టిగా వినిపిస్తున్నారు. లోకేశ్ సారథ్యంలో టీడీపీకి బంగారు భవిష్యత్ ఉంటుందని తెలుగుదేశం క్యాడర్ చాలా చాలా బలంగా నమ్ముతోంది.
ఇందుకు కారణం లేకపోలేదు. లోకేష్ చొరవతోనే తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటైంద. కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ అరహరం పాటుపడుతున్నారు. కోటి మందికి పైగా ఉన్న తెలుగుదేశం సైన్యంలో అత్యధికులను లోకేష్ పేరుపెట్టి పిలవగలరంటే.. క్యాడర్ తో ఆయన ఎంతగా మమేకమయ్యారో అర్ధం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఐదేళ్ల జగన్ హయాంలో కేసులకు, వేధింపులకు భయపడి.. మౌనంగా ఉండిపోయి, ఇళ్లకే పరిమితమైన పార్టీ నేతలను బయటకు తీసుకువచ్చింది లోకేష్ యువగళం పాదయాత్రే అనడంలో సందేహం లేదు. ఆయన దూకుడు, ఆయన సాహసమే జగన్ అరాచకపాలన పతనానికి బీజం వేసిందని చెప్పడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.
ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటూ తెలుగుదేశం నుంచి వచ్చిన డిమాండ్ కు జనసేన నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని ఏముంది? చాలా రాష్ట్రాలలో ఒకరికి మించి డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అంతెందుకు జగన్ కేబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. దీంతో జనసేన వర్గాల నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం అన్న ప్రతిపాదనకు ఎటువంటి వ్యతిరేకతా రాలేదు.
ఒక్క పిఠాపురంలో మాత్రమే జనసైనికులు రుసరుసలాడుతున్నారు. ఇందుకు కారణంగా మాజీ ఎమ్మెల్యే వర్మ డిప్యూటీ సీఎంగా లోకేష్ కు ప్రమోషన్ అంటూ గట్టిగా గళం వినిపించడమే. ఇందుకు కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ అనగానే వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళనలూ చేపట్టారు. అయితే చంద్రబాబు జోక్యంతో తన ఆందోళన విరమించి, అసంతృప్తిని మరిచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. దీంతో జనసేనా విజయంలో సింహభాగం వర్మ ఖాతాలో పడింది. సహజంగానే ఇది నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ కు ఒకింత ఆగ్రహానికి కారణమైంది. దీంతో వర్మతో నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ కు గ్యాప్ పెరిగింది. అదే ఇప్పుడు పార్టీలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు నారా లోకేష్ కు ప్రమోషన్ అంటూ డిమాండ్ చేసినా రాని వ్యతిరేకత వర్మ నోట ఆ డిమాండ్ రాగానే పిఠాపురం జనసైనికుల్లో ఆగ్రహం పెల్లుబకడానికి కారణమైంది. జనసేన క్యాడర్ తో తనకు ఉన్న గ్యాప్ గురించి తెలిసి కూడా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అన్న మాటను అనాలోచితంగానో, పార్టీలోని సీనియర్లు కూడా చేస్తున్న డిమాండే కదా తాను చేస్తే తప్పేముందన్న భావనతోనో చేసి ఉండచ్చు. అయితే వర్మ చేసిన ఈ ప్రకటన ఇప్పటికే వర్మ పట్ల ఒక విధమైన వ్యతిరేకతను పెంచుకున్న జనసేన క్యాడర్ ను రెచ్చగొట్టింది.