తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎవరవుతారో?
posted on Sep 21, 2015 3:53PM
.jpg)
తెలుగుదేశం తెలంగాణా శాఖకి ప్రస్తుతం ఎల్. రమణ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగుస్తున్నందున ఆయన స్థానంలో కొత్తగా ఎవరిని అధ్యక్షుడు నియమించాలనే విషయంలో పార్టీ నేతల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. ఐ.వి.ఆర్.యస్. పద్దతిలో అధ్యక్షుడుని ఎన్నుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించినప్పటికీ, తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికే ఆ బాధ్యతలు అప్పగించినట్లయితే వచ్చే తెరాస చేతిలో పార్టీ విచ్చినం అయిపోకుండా కాపాడుకొంటూ పార్టీని బలపరుస్తారని కొందరు నేతలు భావిస్తున్నారు.
పార్టీలో సీనియర్ నేత అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఎల్. రమణ కూడా తనే ఆ పదవిలో కొనసాగాలనుకొంటున్నారని సమాచారం. అనేకసార్లు టికెట్లు పదవులు ఆశించి భంగపడిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా ఈ రేసులో ఉన్నారు. దళితుడినయిన తనకే అధ్యక్ష పదవిని ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. సాధారణంగా ఇటువంటి వ్యవహారాలలో తుది నిర్ణయం తీసుకొనే చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీ నేతలనే చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావాలని కోరడంతో వారందరూ నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో సమావేశమయ్యారు. కానీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కనుక త్వరలోనే అందరూ మరోమారు సమావేశమవ్వాలని నిర్ణయించుకొన్నారు.
తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీల నేతలకు పదవులు ఎర వేయడం ద్వారా వారిని తెరాసలోకి ఆకర్షించి ప్రతిపక్షాలను బలహీనపరిచాలని తెరాస ప్రయత్నిస్తున్నందున, పార్టీని బలోపేతం చేసి తెరాసను డ్డీకొనే విధంగా తయారు చేయడానికి మంచి సమర్దుడయిన నాయకుడు చాలా అవసరం ఉంది. రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ, పార్టీ నేతలను, వర్కర్లను అందరినీ ఏకత్రాటిపై నడిపించగల తెలివి తేటలు కూడా చాలా అవసరం. ఎర్రబెల్లి తదితరులు రేవంత్ రెడ్డి అంత దూకుడుగా వెళ్లడాన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. దాని వలన ఆయన వ్యక్తిగతంగా ప్రజలలో, పార్టీ అధిష్టానం వద్ద మంచిపేరు సంపాదించుకోవచ్చును కానీ పార్టీకి ఊహించని సమస్యలు కూడా తెచ్చిపెట్టె అవకాశం కూడా ఉందని వారు భావిస్తున్నారు.