చంద్రబాబు నిర్ణయంతో జగన్ కు తిప్పలు
posted on Sep 21, 2015 1:47PM

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం కలిగించో, అంతే స్థాయిలో ఏపీ ప్రభుత్వంలో పెను కదిలిక తెచ్చింది, ట్యాపింగ్ ఎపిసోడ్ తో ఉలిక్కిపడిన చంద్రబాబు, ఇదంతా హైదరాబాద్ లో ఉండటం వల్లే జరిగిందని నిర్ధారణకు వచ్చారు, ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచి పదేళ్లపాటు పాలన సాగించేందుకు ఏపీకి అధికారులున్నా, ఏదో తెలియని భయాందోళనలను టీడీపీ నేతల్లో నింపింది. అదే సొంత రాష్ట్రం నుంచే పాలన జరుగుతూ ఉంటే, ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉండేది కాదని, టెక్నికల్ గానూ అది సాధ్యపడకపోయేదని గుర్తించారు. పైగా ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలంటే, విజయవాడ ప్రాంతానికి త్వరగా తరలివెళ్లడమే మంచిదని భావించిన చంద్రబాబు...ఆ దిశగా వేగంగా అడుగులేస్తున్నారు.
అయితే ప్రభుత్వ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని అధికారంలోకి వచ్చిన మూడ్నెళ్లలోనే నిర్ణయం తీసుకున్నా, అనేక కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు, కానీ ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ దెబ్బతో తరలింపు ప్రక్రియను స్పీడప్ చేశారు, అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వారంలో నాలుగైదు రోజులు విజయవాడలో ఉంటూ పాలన సాగిస్తూ, సమీక్ష నిర్వహిస్తుండటంతో, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ నుంచి బెజవాడకు షిఫ్ట్ అవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. దాంతో జగన్ కూడా తన కార్యకలాపాలను విజయవాడ లేదా అమరావతి సమీప ప్రాంతం నుంచి సాగించాలని డిసైడ్ అయ్యారట. ఈలోపు చంద్రబాబు మాదిరిగా వారంలో మూడు నాలుగు రోజులు ఏదో ఒక అంశంపై ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నా, అమరావతి ఏరియాకి షిఫ్ట్ అయితేనే ప్రభుత్వ వైఫల్యాలను మరింత సమర్ధంగా పోరాడొచ్చని భావిస్తున్నారట. అందుకే, విజయవాడ, అమరావతి పరిసరాల్లో మంచి ఇల్లు కోసం జగన్ అన్వేషిస్తున్నారని, అన్నీ కుదిరితే సంక్రాంతి నాటికే మకాం మార్చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
అయితే ఏదోరోజు విజయవాడ ప్రాంతానికి దుకాణం మార్చాల్సి ఉన్నా, ఇంత అర్జెంట్ గా నిర్ణయం తీసుకోవడానికి మాత్రం చంద్రబాబే కారణమట, బాబు ఎక్కువగా బెజవాడలోనే ఉంటుండటంతో ప్రతిపక్ష నేత జగన్ కూడా షిఫ్ట్ కావాల్సిన అనివార్యత ఏర్పడిందని, ఆ విధంగా జగన్... బాబు ఉచ్చులో పడ్డారని అంటున్నారు. అయితే సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న జగన్... తరుచుగా కోర్టులకు హాజరుకావాల్సి ఉండటంతో...విజయవాడకు షిఫ్ట్ అవడం ఇబ్బందికర పరిస్థితేనంటున్నారు. చంద్రబాబుకైనా, జగన్ కైనా హైదరాబాద్ ను పూర్తిగా వదిలివెళ్లాలంటే కొంచెం కష్టమేనేమో