కాంగ్రెస్, తెదేపాలది అపవిత్ర కలయిక: తలసాని

 

మంత్రి పదవి కోసం పార్టీని మార్చి నేటికీ తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నైతిక విలువల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లను వివిధ కారణాలతో తెరాస ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మొట్టమొదట తెదేపా, బీజేపీలు, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేసాయి. అయినా ఎటువంటి ఫలితం కనబడకపోవడంతో రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నాయి. తెరాస ప్రభుత్వం సుమారు 25లక్షల ఆంధ్రా ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించిందని తెలంగాణా రాష్ట్ర పీ.సి.సి. అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలన్నీ పోరాటం ఆరంభించడంతో తెరాస ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది.

 

ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆందోళనపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆవిధంగా అవి కలిసి పోరాటం చేయడం చాలా అనైతికమని అన్నారు. బద్ద విరోధులయిన కాంగ్రెస్, తెదేపాలు కలిసి పోరాటాలు చేయడం చాలా అపవిత్ర కలయికగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసరమయిన రాద్దాంతం చేస్తూ ప్రజలను త్రప్పు ద్రోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆంద్ర ప్రజలు ఎక్కువగా ఉన్న జి.హెచ్.యం.సి. పరిధిలో తెరాస పోటీ చేసినా ఎన్నికలలో గెలవలేదని తెరాసకు కూడా తెలుసు. అందుకే వార్డుల పునర్విభజన సాకుతో ఆంద్ర ఓటర్లను ఏరిపడేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారు చేస్తున్న ఈ ఆరోపణలకి తలసాని నేరుగా సమాధానం చెప్పకుండా, కాంగ్రెస్, తెదేపాలు కలిసి పనిచేయడాన్ని తప్పు పడుతున్నారు.

 

ఒకవేళ తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలు కలిసి పనిచేయడం అపవిత్రమయితే తెరాసకు అదే సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో తెరాస నేతలకంటే కాంగ్రెస్, తెదేపాల నుండి వచ్చి చేరిన వారే ఎక్కువగా ఉన్నారు. వారే అన్ని కీలక పదవులను ఆక్రమించేశారు. తెదేపా నుండి తలసాని, తీగల, తుమ్మల, కడియం, గంగుల వంటి అనేక మంది నేతలు తెరాసలో కే.కేశవ్ రావు, డి.శ్రీనివాస్ వంటి కాంగ్రెస్ నేతలతో భుజం భుజం రాసుకొని పనిచేస్తున్నారిప్పుడు. కనుక రాజకీయ నాయకులు పవిత్రత, నైతిక విలువల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu