అంత ‘ఫాస్ట్’ ఉండబోదిప్పుడు

 

కేవలం తెలంగాణా విద్యార్థులకే ఫీజు రీ ఇంబర్స్ మెంటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ‘ఫాస్ట్’ పధకాన్ని పక్కనపెట్టాలని నిన్న జరిగిన తెలంగాణా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇది పేద విద్యార్ధులకు సంబంధించిన విషయం గనుక దానిని పక్కనబెట్టి అందరినీ ఆదుకోవాలని నిర్ణయించుకొన్నాము. కానీ ఆర్టికల్ 371లో సెక్షన్ (డి) ప్రకారమే చెల్లిస్తాము. దానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గత ప్రభుత్వం నాలుగేళ్లలో రూ. 1650 కోట్లు బకాయిలు చెల్లించకుండా తప్పుకోవడంతో ఆ భారం మా నెత్తినే పడింది. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దానిలో సగం చెల్లించాము. మిగిలింది కూడా త్వరలోనే చెల్లించాలని నిర్ణయించాము.”

 

పేద విద్యార్ధుల జీవితాలకి సంబంధించిన విషయం గనుక తెలంగాణా ప్రభుత్వం ‘ఫాస్ట్’ ని అమలు చేయకూడదని నిర్ణయించుకొందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. పేద విద్యార్ధులకు సహాయం చేసేందుకే గత ప్రభుత్వాలు ఈ ‘ఫీజు రీఇంబర్స్ మెంటు’ పధకాన్ని అమలుచేస్తున్నాయి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ‘అందరికీ కాదు తెలంగాణా విద్యార్ధులకి మాత్రమే’ అంటూ చాలా ఫాస్ట్ గా దూసుకు వెళ్ళినందుకు ఆయన (ప్రభుత్వాని)కి కోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ప్రాంతాలు, కులాలు, మతాలు పేరిట విద్యార్ధులలో వివక్ష చూపితే సహించబోమని హైకోర్టు చాలా గట్టిగా హెచ్చరించిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గవలసి వచ్చింది. అయితే అది ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తోంది గనుక పేద విద్యార్ధులను దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ పధకం పక్కనపెట్టామని ఆయన చెప్పుకొన్నారు. ఏమయితేనేమి, ఇప్పటికయినా వెనక్కి తగ్గి తప్పును సరిదిద్దుకొన్నారు గనుక ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయిందనుకోవచ్చును. కానీ ఆర్టికల్ 371లో సెక్షన్ (డి) ప్రకారమే చెల్లిస్తామని చెప్పారు. స్థానికతకు దానిని ప్రామాణికంగా కోర్టులు కూడా అంగీకరిస్తున్నాయి కనుక దానికి ఎవరూ అభ్యంతరం చెప్పబోరు కూడా. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన చెప్పారు. అందుకు  తప్పకుండా ఆయనను అభినందించవలసిందే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు ఎలా ఉంటుందో తెలుసు కొనేందుకు ఒక చక్కటి ఉదాహరణ. పేద ప్రజలను తమ కంటే ఎవరూ పట్టించుకొనేవారు ఉండరని డప్పు కొట్టుకొని తిరిగే కాంగ్రెస్ నేతల మాటలు అబద్దాలని ఈ బకాయిలు చెపుతున్నాయి.