టీకప్పు చెప్పే పాఠం

ఒక పెద్దాయనకి రకరకాల టీకప్పులని సేకరించే అలవాటు ఉండేది. అలా ఆయన వేర్వేరు ఆకారాలు, రంగులలో ఉండే వందలాది టీకప్పులని సేకరిస్తూ ఉండేవాడు. అలా ఓసారి ఆయన టీకప్పులని అమ్మే షాపుకి వెళ్లాడు. అక్కడ ఎదురుగుండా ఉన్న షోకేసులో ఓ ఎర్రటి టీకప్పు చూసి డంగైపోయాడు. తన జీవితంలో ఎన్నో రకాల కప్పులని చూశాడు. కానీ ఇంత అందమైన టీకప్పుని ఎన్నడూ చూసి ఎరుగడు. దాంతో వెంటనే ఆ షాపు యజమాని చెప్పిన ధరని చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నాడు.

 

తన చేతికి సొంతమైన టీకప్పుని చేస్తూ పెద్దాయన- ‘ఈ టీ కప్పు ఇంత అందంగా ఎలా ఉందబ్బా!’ అని మురిసిపోవడం మొదలుపెట్టాడు.

 

‘నాకు ఇంత అందం ఎలా వచ్చిందో తెలుసా!’ అని అడిగింది టీకప్పు. తను విన్నది నిజమే! టీకప్పు మాట్లాడుతోంది. ‘చెప్పు చెప్పు! నీకు ఇంత అందం ఎలా వచ్చింది,’ అని అడిగాడు పెద్దాయన. ‘నేను మొదట్లో మట్టిగానే ఉండేదాన్ని. నన్ను ఒకతను చేతిలోకి తీసుకుని ముద్దముద్దగా చేసిపారేశాడు. నన్ను నేలకేసి కొడుతూ, చేతులతో పిసుకుతూ నానా హింసలూ పెట్టాడు. చాలు బాబోయ్ చాలు అన్న వినిపించుకోలేదు. అప్పుడే కాదు అంటూ నన్ను చితక్కొట్టేశాడు.

 

‘ఆ తర్వాత నన్ను ఒక చక్రం మీద పడేశాడు. దాని మీద పడేసి గిరగిరా తిప్పుతూ ఉంటే... నాకు కళ్లు తిరిగాయి. నా వల్ల కాదు బాబోయ్ నన్ను ఈ చక్రం మీద నుంచి దింపెయ్యి అని అడిగాను. అప్పుడే కాదు అంటూ నన్ను అటు లాగీ ఇటు లాగీ ఓ చిత్రమైన ఆకారం కిందకి మార్చాడు.

 

‘ఏదో ఒక ఆకారం ఏర్పడింది కదా! ఇక నా బాధలు తీరిపోయాయి అనుకున్నాను. ఊహూ! నన్ను తీసుకువెళ్లి ఒక బట్టీలో (పొయ్యి) పడేశాడు. ఆ పొయ్యిలో వేడికి నేను సలసలా మరిగిపోయాను. నాలో నీరంతా ఎండిపోయింది. నా చర్మం కాలిపోయింది. నన్ను వదిలెయ్యి అంటూ ప్రాథేయపడ్డాను. అప్పుడే కాదంటూ అతను చిరునవ్వు నవ్వాడు.

 

‘పోనీలే ఎలాగూ ఎండిపోయాను. ఇక నన్ను ఏమీ చేయలేడు అనుకున్నాను. కానీ నా మీద రకరకాల రంగులన్నీ పూసి వదిలిపెట్టాడు. నాకు ఊపిరాడటం లేదు బాబోయ్! నన్ను వదలిపెట్టు అంటూ అతన్ని వేడుకున్నాను. అప్పుడే కాదంటూ అతను కాసేపు అవతలికి వెళ్లిపోయాడు.

 

‘నామీద ఉన్న రంగులన్నీ ఎండిపోయాక తిరిగి నన్ను ఇంకోసారి బట్టీలో పడేశాడు. మరోసారి ఆ వేడిని తట్టుకోవడం నా వల్ల కాలేదు. నన్ను వదిలెయ్యిరా నాయనా అంటూ ఎంతగా ప్రాథేయపడినా అతనిలో చలనం లేకపోయింది. ఇక నేను ఆ వేడికి బూడిదైపోతాను అనగా నన్ను బయటకు తీశాడు.

 

‘బట్టీ నుంచి బయటకు వచ్చిన చాలాసేపటికి కానీ నేను చల్లారలేదు. నాలో వేడి ఉన్నంతసేపూ కూడా నేను నా కర్మని తిట్టుకుంటూనే ఉన్నాను. నాకే ఎందుకీ కష్టం! అని దేవుని నిందిస్తూనే ఉన్నాను. ఇంతలో అతను మళ్లీ వచ్చాడు. ఈసారి అతని చేతిలో ఒక అద్దం ఉంది. అ అద్దం నా ముందు పెట్టాడు. ఆశ్చర్యం. ఆ అద్దంలో మట్టి లేదు! ఒక అందమైన రంగురంగుల తళుకుబెళుకుల రూపం కనిపించింది. అది నాదే అని నమ్మలేకపోయాను.

 

‘నొప్పిగా ఉంది కదా అని నన్ను మట్టిలాగే ఉంచేస్తే నేను అక్కడే మిగిలిపోయేదాన్ని. కళ్లు తిరుగుతున్నాయి కదా అని నన్ను ముద్దలా చేయకపోతే ఎండిపోయేదాన్ని. వేడిగా ఉంది కదా అని బట్టిలోంచి తీసేస్తే పగిలిపోయేదాన్ని. ఊపిరి సలపడం లేదు కదా అని రంగులు వేయడం మానేస్తే అసంపూర్ణంగా మిగిలిపోయేదాన్ని. మరోసారి నన్ను బట్టీలో వేయకపోతే ఈ మెరుపు వచ్చేదే కాదు. నా అందం వెనకాల ఇంత కష్టం ఉంది తెలుసా!’ అని చెప్పుకొచ్చింది టీకప్పు.

టీకప్పు చెప్పిన మాటలు మన జీవితానికి కూడా అన్వయిస్తాయేమో!
 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.