కేఈతోపాటు ఐదుగురు మంత్రులకు డేంజర్ సిగ్నల్స్

అవినీతిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలు పంపడంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో అవినీతి డబుల్ డిజిట్ కి చేరిందంటూ బాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఇది మంత్రులందరికీ హెచ్చరికేనంటున్నారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న చంద్రబాబు, లోపాలు కనిపిస్తే మాత్రం అక్కడికక్కడే కడిగిపారేస్తున్నారు, దాంతో అమాత్యులందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది, దీనికి రెవెన్యూమంత్రి కేఈ వ్యవహారమే రుజువుగా చెబుతున్నారు. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందంటూ కలెక్టర్స్ మీట్ లో సర్వే రిపోర్ట్స్ ను బయటపెట్టిన చంద్రబాబు, మూలాల నుంచి ప్రక్షాళన చేయాలని చెప్పారట.

ముందుగా డిప్యూటీ సీఎం ఈ కృష్ణమూర్తిని రెవెన్యూశాఖ నుంచి తప్పిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినబడుతోంది. డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్స్, ఆర్డీవోల బదిలీల్లో పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు రావడంతో ట్రాన్స్ ఫర్స్ ను రద్దుచేసిన చంద్రబాబు, చివరికి ఆ శాఖ నుంచి కేఈనే తప్పించాలని నిర్ణయానికి వచ్చారట. దీనికితోడు కేఈ సచివాలయానికి రాకుండా ఇంట్లోనే ఉంటూ ఫైళ్లు పరిశీలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి, అంతేకాకుండా తన శాఖ పట్ల కేఈ పట్టుసాధించలేకపోతున్నారని, ఎప్పటికప్పుడు సమీక్షలు చేయలేకపోతున్నారని అంటున్నారు, దాంతో కీలకమైన రెవెన్యూశాఖ నుంచి కేఈని తప్పించి, ఏదైనా చిన్నశాఖను అప్పగించాలని భావిస్తున్నారట,

అయితే రెవెన్యూశాఖలో బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి కేఈ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల సూచన మేరకే తాను బదిలీలు చేశానని, ఎలాంటి నిబంధనలూ ఉల్లంఘించలేదని చెప్పారట. అయితే కొందరు ఎమ్మార్వోలు, వీఆర్వోలు ప్రజలను పీక్కుతింటున్నారని, వారి వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని డిప్యూటీ సీఎం కేఈ అంటున్నారు, చంద్రబాబుపై తనకు నమ్మకముందని, సీఎంతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని వ్యాఖ్యానిస్తున్నారు. బదిలీల వ్యవహారంలోనూ టీడీపీ నేతల ఎలాంటి విభేదాలు లేవంటున్న కేఈ...కర్నూలు జిల్లాలో జరిగిన28మంది తహశీల్దార్లు, 20మంది డిప్యూటీ తహశీల్దార్లు, 14మంది సీనియర్ అసిస్టెంట్లు, 8మంది జూనియర్ అసిస్టెంట్లు, 9మంది రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల బదిలీలన్నీ కార్యకర్తల ఇష్టప్రకారమే జరిగాయంటున్నారు.

అయితే తాను రెండంకెల ప్రగతి కోసం నానా అగచాట్లు పడుతుంటే, కొందరు మంత్రులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాబు సీరియస్ గా ఉన్నారట, అందుకే పలువురికి ఉద్వాసన పలకడంతోపాటు కొందరికి శాఖల మార్పు చేయాలని యోచిస్తున్నారట, అందుకే కేఈతోపాటు మరో ఐదుగురు మంత్రులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్ లో మహిళాశిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పంచాయితీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu