డయాబెటిక్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే చాలా ఈజీగా షుగర్ వచ్చేస్తుంది..!


రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

డీప్ ఫ్రైడ్ స్నాక్స్..

సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది.

మార్కెట్ ఫుడ్స్..


మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి.

ప్రాసెస్డ్ మీట్..

సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి.

డ్రింక్స్..

శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.

రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్..

తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

వైట్ రైస్..

తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.

                          *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu