రాజకీయాల్లోకి రావడం అంత వీజీకాదు!
posted on Oct 25, 2024 4:12PM

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఓ సినిమాలో సీతతో అంత వీజీ కాదు అన్న డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అదే స్టైల్ లో తాజాగా సాయిధరమ్ తేజ్ రాజకీయాలలోకి రావడం అంత వీజీ కాదను అని కామెంట్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించే సాయిధరమ్ తేజ్ ఇటీవలి ఎన్నికలలో జనసేన తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా పిఠాపురంలో మకాం వేసి తన మేనమామ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో సాయిధరమ్ తేజ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్న చర్చ మోగాభిమానుల్లో జోరుగా సాగింది. అయితే ఈ చర్చకు తాజాగా సాయిధరమ్ తేజ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఇటీవల ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఆయన తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ప్రవేశం అంత ఈజీ కాదనీ, పలు అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని అన్నారు. అయినా తనకు ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేశమాత్రంగానైనా లేదనీ, ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందనీ కుండబద్దలు కొట్టేశారు.
ఈ ఇంటర్వ్యూలోనే గతంలో తాను ప్రమాదానికి గురైన సంఘటనపైనా మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తాను దాదాపు రెండు వారాలపాటు కోమాలో ఉన్నట్లు చెప్పిన ఆయన తానీ రోజు ప్రాణాలతో ఉండటానికి హెల్మెట్ ధరించడమే కారణమన్నారు. ద్విచక్రవాహనదారులు అందరూ తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఇవాళ ప్రాణాలతో ఉండటానికి కారణం హెల్మెటేనని తెలిపారు.