జగన్ ను భయం వెంటాడుతోందా?
posted on Oct 25, 2024 3:49PM
.webp)
జగన్ ను భయం వెంటాడుతోందా? ఓ పక్క కేసుల భయం, మరో పక్క అరెస్టు భయంతో జగన్ వణికిపోతున్నారా? అంటే జగన్ చేష్టలూ, మాటలను బట్టి ఔననే అనుకోవలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సోదరి షర్మిలతో ఓ వైపు రాయబేరాలు నెరపుతూనే మరో పక్క ఆమెపై నేషనల్ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ వేయడం ద్వారా తన మానసిక స్థితి సరిగా లేదని ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నారని అంటున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే షర్మిలతో రాయబారాలకు ప్రయత్నిస్తూనే, ఆమెకు ఆమె వాటా ఆస్తులు ఇచ్చేస్తామంటూనే ఆమె తనగురించి, తన భార్య గురించి మాట్లాడడం మానేయాలని షరతు విధించారు. ఆ షరతు వరకూ అయితే పెద్దగా ఎవరికీ, ఆఖరికి షర్మిలకు కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ, దానితో పాటుగా ఆయన పెట్టిన మరో కండీషనే జగన్ రెడ్డిలోని భయాన్ని ఎత్తి చూపిందంటున్నారు. షర్మిల అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఎటువంటి వ్యాఖ్యలూ చేయకూడదన్నదే ఆ మరో కండీషన్.
గత నెలలో జగన్ రెడ్డి తన తల్లి సోదరి, చెల్లి షర్మిలతో సయోధ్య కోసం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో సయోధ్య కుదరాలంటే తనపైనా, తన భార్య భారతిపైనా ఎటువంటి విమర్శలూ చేయకూడదన్న షరతు విధించారు. అక్కడితో ఆగకుండా షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డిపై కూడా ఎటువంటి విమర్శలూ చేయకూడదన్న షరతు కూడా పెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, కీలక నిందితులలో ఒకడిగా ఉన్న అవినాష్ రెడ్డిపై షర్మిల విమర్శించకూడదంటూ జగన్ విధించిన షరతును షర్మిల అంగీకరించలేదని అంటున్నారు. దాంతోనే షర్మిల, తల్లి విజయమ్మలపై నేషనల్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారని అంటున్నారు.
అయినా జగన్ సొంత తల్లి, చెల్లి కంటే సవతి సోదరుడు అవినాష్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు. సోంత బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి పట్ల జగన్ కు అంత అక్కర ఎందుకు అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమౌతాయి. ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న జగన్ రెడ్డి ప్రతిష్ఠ సొంత ఇలాకాలోనే మసకబారింది. జనం వివేకా హత్య కేసు సూత్రధారి అవినాష్ రెడ్డే అని నమ్ముతున్నారు. అయితే జగన్, భారతి మాత్రం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవినాష్ తో ఆగదనీ, తమ వరకూ వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే ఎలాగైనా అవినాష్ ను కాపాడాలని చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.