ఫ్యామిలీ చేతిలోనే కాంగ్రెస్ పగ్గాలు! జీ హుజూర్ అన్న నేతలు..  

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం అనుకున్నట్లుగానే జరిగింది. ఆశించిన విధంగానే ముగిసింది. ఐదు గంటలకు పైగా జరిగిన సమావేశంలో సోనియా గాంధీ, పార్టీ అధ్యక్ష పదవి గురించి చాలా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ అడగవలసిన అవసరం లేకుండా, కుండబద్దలు కొట్టేశారు. ‘నేనే పార్టీ ప్రెసిడెంట్ ...తాత్కాలికం కాదు ..పూర్తిస్థాయి అధ్యక్షురాలిని నేనే’ అని చాలా స్పష్టంగా చెప్పారు. ‘‘నేను పూర్తి కాలం పని చేసే, చురుగ్గా వ్యవహరించే కాంగ్రెస్ అధ్యక్షురాలిని’’ అని సోనియా గాంధీ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసమావేశానికి హాజరైన అసమ్మతి నేతల బృందం జీ 23 సభ్యులు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ సహా అందరూ సోనియా నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సమావేశానికి మొత్తం 52 మంది హాజరయ్యారు.అందరూ చప్పట్లు కొట్టారు.సంతోషం వ్యక్త పరిచారు. అంతేకాని, ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు ? ఎప్పుడు తీసుకున్నారు? అని ఏ ఒక్కరూ అడగలేదు ..క్రమశిక్షణ గల నాయకులుగా,’జీ హుజూర్’ అంటూ జేజేలు పలికారు. ఆ విధంగా సోనియా గాంధీ, ‘నేనే పార్టీ , పార్టీనే నేను’ అని ఒక్క ముక్కలో తేల్చేశారు.  

సో... అధ్యక్షుడు, అధ్యక్షురాలు లేని పార్టీలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? వంటి కపిల సిబల్ మార్క్ సందేహాలకు ఇక ఆస్కారం లేదు. అంతే కాదు సోనియా గాంధీ, తనతో మాట్లాడ దలచుకున్నవారు మీడియా ద్వారా కాకుండా నేరుగా తనతోనే  చెప్పవచ్చని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో, మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్త పరుస్తున్న జీ 23 సీనియర్లకు చురకలు అంటించారు. ఏది జరిగినా నాలుగు గోడల మధ్య జరగాలే కానీ, లోపలి విషయాలు బయటకు పొక్కదానిని వీలు లేదని ఘట్టిగా హెచ్చరించారు.నిజానికి సోనియా గాంధీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా తమ దృఢ సంకల్పాన్ని చాలా బలంగా, స్థిరంగా వ్యక్త పరిచారు.

సోనియా గాంధీ, ఫుల్ టైమ్ ప్రకటనని స్వాగతించిన సీడబ్ల్యూసీ, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మరో మారు అంతే గట్టిగా కోరింది.  కోరింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సభ్యులంతా కోరినట్లు పార్టీ సీనియర్ నాయకురాలు అంబికా సోని మీడియా సమావేశంలోనూ తెలిపారు. అయితే, ఈవిషయంలో ఆయనపై వత్తిడి తెచ్చేది లేదని నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే వదిలేశామని మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమారి అన్నారు. సో..సోనియా గాంధీ ... ఆమె తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యేందుకు సీడబ్ల్యూసీ ఒకే సారి ఓకే చెప్పేసింది. ఆ విధంగా నాయకత్వ సమస్యకు సోనియా గాంధీ శాశ్వత పరిష్కారం చూపారు. గాంధీలదే పార్టీ అని ఆమె చెప్పకనే చెప్పారు.వచ్చే సంవత్సరం (2022) అక్టోబర్’లో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని అంబికా సోనీ సూచన ప్రాయంగా చెప్పారు. అంటే అంతవరకు సోనియా ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షపదివిలో కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. 

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీనియర్ నాయకులు ముక్తకంఠంతో చేసిన  విజ్ఞప్తులను పరిశీలిస్తానని రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. సమావేశానంతరం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయ స్పందిస్తూ,  ఆ విషయం పరీశీలిస్తానని చెప్పారు. అయితే  పార్టీ నేతల నుంచి ముందు సైద్ధాంతిక స్పష్టత రావాలని, అన్నారు. అదే సమయంలో పార్టీ ఎన్నికలు జరిగే వరకూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండాలని కొందరు నేతలు సమావేశంలో ప్రతిపాదించారని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు.అంటే, సీడబ్ల్యూసీ సమావేశం ప్రధానంగా  మూడు విషయాలలో స్పష్టత నిచ్చింది...అందులో మొదటిది పార్టీ ఇప్పుడు నడుస్తున్న తీరునే నడుస్తుంది.

అయితే ఇంతకాలం, తాత్కాలిక అధ్యక్షురాలిగా పరిమితులకు లోబడి పనిచేసిన సోనియా గాంధీ, ఇక ఫై పూర్తి అధికారాలతో, నిర్ణయాలు తెసుకుంటారు. అంటే కపిల్ సిబల్ లాగా, ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఈనిర్ణయం ఎలా తీసుకున్నారు? అని లీగల్ పాయింట్లు లాగితే, ఇక అంతే సంగతులు క్రమశిక్షణ చర్యలు తప్పవు. అలాగే,ఇంతవరకు ఏ బాధ్యతా లేకున్నా కీలక నిర్ణయాలు రాహుల్ ఎలా తీసుకుంటున్నారు ? అని మళ్ళీ మరొకరు ప్రశ్నించ కుండా సోనియా గాంధీ రేపో మాపో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్’ గా ప్రకటిస్తారు. గతంలో ప్రశాంత్ కిషోర్ ప్రొపోజ్ చేసిన విధంగా,ఏ కమల నాథ్’నో మరొక జీహుజూర్ ‘నో మరో వర్కింగ్ ప్రెసిడెంట్’ చేస్తారు. అక్కడితో కథ ముగిసిపోతుంది.