హీటెక్కిన హుజురాబాద్ ఉప సమరం.. ఈనెల 27న సీఎం కేసీఆర్ ప్రచారం

తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక సమరం కాక రేపుతోంది. మరో 10 రోజుల్లో ప్రచార గడువు ముగియనుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. బతుకమ్మ, దసరా పండుగలతో గత పది రోజులుగా ప్రచారం మందకొడిగా సాగింది. పండుగలు ముగియడంతో ప్రచారం తారా స్థాయికి చేరింది. అన్ని పార్టీల స్టార్ క్యాంపెయినర్లు జోరుగా జనంలో తిరుగుతున్నారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్న టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27న ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్నట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల పరిధిలోనే కేసీఆర్ పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు ఈ నెల 25న హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ భవన్‌లో ఆ పార్టీ శాసన, పార్లమెంటరీ పార్టీ సంయుక్తంగా భేటీ అవుతున్నాయి.  కేంద్ర, రాష్ట రాజకీయాలు, టీఆర్ఎస్ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 25న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న పార్టీ ప్లీనిరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నట్టు సమాచారం.