దసరా రోజు కుమ్మేశారు.. ఎంత తాగారంటే? 

అనుమానం లేదు. తెలంగాణ ధనిక రాష్ట్రమే.ఒక్క రోజులో రెండు వందల  కోట్ల రూపాయల మద్యం తాగిన రాష్ట్రం ధనిక రాష్ట్రం కాక ఇంకేమవుతుంది. దసరా పండగ సందర్బంగా ఒక్కరోజే, 178 కోట్ల విలువగల మద్యం రాష్ట్రంలోని వైన్ షాపులు,  బార్ అండ్ రెస్టారెంట్‌లకు చేరింది. అంతకు స్టాక్తో కలిపితే   పండగ పూట కనీసం ఓ రెండు వందల  కోట్ల రూపాయల మేరకు  మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అంచనాకు వచ్చినట్లు సమాచారం.ఇది గత సవత్సరం కంటే చాలా ఎక్కువని కూడా అధికారుల లెక్కలు చెపుతున్నాయి. గత ఏడాది దసరాతో పోల్చితే ఈసారి లిక్కర్‌ విక్రయాల్లో 39 శాతం, బీర్లలో 57 శాతం వృద్ధిరేటు నమోదయిందని వివరించారు. 

ఈ సారి దసరా సందర్భంగా ఈ నెల 12 నుంచి 16 (శనివారం) వరకు ఐదు రోజుల్లోనే రూ.685 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. దీంతో ఎక్సైజ్‌ శాఖకు జోరుగా ఆదాయం వచ్చింది. గత ఏడాది దసరా సందర్భంగా ఈ అమ్మకాలు రూ.406 కోట్ల దాకా జరిగాయి.  అంతే కాదు, మొత్తంగా చూస్తే  అక్టోబర్ నెలలో మొదటి 11 రోజుల్లో 1400 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 

దేశంలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి, దేశం ఆకలి కేకలు పెడుతోందని అంతర్జాతీయ నివేదికలు ఘోషిస్తున్న సమయంలో, ఇంకా నిండా ఏడేళ్లు అయినా నిండని తెలంగాణ ఒక్కరోజులో వందల కోట్ల రూపాయల విలువ చేసే మద్యం తాగడం అంటే మాములు విషయం కాదు. దేశంలో మరే రాష్ట్రం సాధించని, మరో గొప్ప విజయం తెలంగాణ రాష్ట్రం సాధించింది అనుకోవచ్చును.  

నిజానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలుపెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఇదే అక్టోబర్ నెలలో 2వేల 623 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో సెలవులు పోను 11 రోజుల్లోనే 1400 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ లెక్కన అక్టోబర్ నెల చివరి రోజుకు రాష్ట్రంలో మద్యం విక్రయాలు  3 వేల కోట్ల మార్క్’ను దాటేసినా దాటేస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.అంతేకాదు దేశంలో ఏ రాష్ట్రంలో మద్యం మీద రాని ఆదాయం తెలంగాణలో వస్తోంది. అందుకే ప్రభుత్వం బడ్జెట్లోనే  మద్యం అమ్మకాల నుంచి 30 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా  పెట్టుకుంది. గతంలో ఆశించిన లక్ష్యాలను చేరుకున్న మద్యం విక్రయాలు, ఈ సంవత్సరం కూడా చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెపుతున్నారు. సో.. చీర్స్..