వరద నీరుతో మునిగిన స్థలాలను ఇళ్లకు కేటాయించారు

కాదేదీ ఇళ్ల స్థలాలకు అనర్హం అన్నట్టు ఏపీ ప్రభుత్వం పలు వివాదాస్పద స్థలాలను పేదవారి ఇళ్ళ స్థలాల కోసం ఎంపిక చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వరద నీటిలో మునిగిపోయే స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

 

ఆవ భూములలో ఇళ్ల స్థలాలు పంపిణీని వెంటనే రద్దు చేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. వర్షాలకు ఇప్పటికే ఈ ప్రాంతమంతా మునిగిపోయిందని.. మళ్లీ వర్షం వస్తే 30 వేల మందికి పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఈ భూములకు ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకుని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఆవలో ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని, ప్రభుత్వానికి కళ్లు ఉంటే అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు.

 

ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆవ భూములు నివాస యోగ్యం కాదని హెచ్చరించినా, ఆ నివేదికను పక్కన పెట్టి, ఒక యూనివర్శిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు స్వీకరించారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణ వ్యవహారంలో గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించకపోగా.. ఇప్పుడు అడ్డగోలుగా ఇలాంటి భూములను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే.. ప్రభుత్వంపై బీజేపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.