ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సెప్టెంబర్ 5 నుంచి జగనన్న విద్యాకానుక
posted on Aug 19, 2020 3:03PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకు పైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. సెప్టెంబర్ 11న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
సెప్టెంబర్ 1న గర్భిణీలు, బాలింతలు, పిల్లల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి శ్రీకారం చుట్టనుంది. సెప్టెంబర్ 5న జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. విద్యాకానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయనుంది. 3 జతల యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెక్స్ట్ పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించాలని నిర్ణయించింది.
ఎన్నికల హామీ ప్రకారం ఇంటింటికి నాణ్యమైన బియ్యం అందించాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని డిసెంబర్1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 9260 వాహనాల ద్వారా ఇంటివద్దనే తూకం వేసి బియ్యం పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులకు సబ్సిడీపై వాహనాలు అందజేయనుంది. అలాగే 583 కోట్లతో బియ్యం కార్డుదారులకు వైఎస్సార్ భీమా పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పంచాయితీరాజ్ శాఖలో 51 డివిజినల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.