మళ్ళీ రెచ్చిపోయిన శివసైనికులు

 

మొన్న ముంబైలలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కసౌర్ పుస్తకావిష్కారణ కార్యక్రమంలో పాల్గోనందుకు భారత మాజీ దౌత్యవేత్త సుదీంద్ర కులకర్ణి మొహంపై నల్లరంగు పోసి రసాబాస చేసిన శివసైనికులు ఈసారి తమ ప్రతాపం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బి.సి.సి.ఐ.) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పై ప్రదర్శించారు.

 

ఇవ్వాళ్ళ ఆయన ముంబైలోని బి.సి.సి.ఐ. ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులతో భారత్-పాక్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం గురించి చర్చిస్తున్నప్పుడు శివసైనికులు లోపలకి చొచ్చుకువచ్చి పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులతో చర్చలుజరపడానికి వీలులేదంటూ నానా రభస చేసారు. భారత్ సైనికులను పొట్టనబెట్టుకొంటూ, భారత్ పై ఉగ్రవాదులతో దాడులు చేయిస్తున్న పాకిస్తాన్ తో ఎటువంటి క్రికెట్ మ్యాచ్ లు ఆడరాదని వారు డిమాండ్ చేసారు. పాక్ వైఖరికి నిరసనగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు నిలిపివేసిన తరువాత కూడా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడాలని ఎలాగ అనుకొంటున్నారు? అని వారు శశాంక్ మనోహర్ ని ప్రశ్నించారు. కనుక తక్షణమే క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులతో చర్చలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేసారు. ఒకవేళ భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహించాలని ప్రయత్నిస్తే తాము ఖచ్చితంగా వాటిని అడ్డుకొంటామని హెచ్చరించారు.

 

శివసైనికుల వాదన సహేతుకమయినదే కావచ్చును. కానీ భారత ప్రభుత్వం అనుమతి లేనిదే బి.సి.సి.ఐ. పాకిస్తాన్ బోర్డు అధికారులతో చర్చించే సాహసం, పొరపాటు చేయదు. కనుక బి.సి.సి.ఐ. అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కేంద్రప్రభుత్వం అనుమతితోనే పాకిస్తాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు భావించవలసి ఉంటుంది. కనుక శివసేన పార్టీ ఆయనను ప్రశ్నించడం కంటే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సబబుగా ఉంటుంది. పైగా నేటికీ మహారాష్ట్రలో శివసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. గనుక ఈ విషయంపై మోడీ ప్రభుత్వ వైఖరి ఏమిటని నిలదీయవచ్చును. ఒకవేళ వారికి మోడీ ప్రభుత్వం నుండి సంతృప్తికరమయిన జవాబు రానట్లయితే అప్పుడు ప్రజాస్వామ్యబద్దంగా, చట్టబద్దంగా శివసేన తగిన నిర్ణయం తీసుకోవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా ఈవిధంగా అందరిపై దౌర్జన్యం చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తూ ముంబైలో సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనుకొంటే ఏదో ఒకరోజు భంగపాటు తప్పదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu