ఏపీకి మోడీ వరాలు ఇచ్చే అవకాశం లేదా?
posted on Oct 19, 2015 4:06PM

ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి ప్రత్యేక వరాలు ప్రకటించే అవకాశం లేనట్లే కనిపిస్తున్నాయి. కొత్త రాజధాని నిర్మాణంపై సునిశిత విమర్శలు చేసిన వెంకయ్య... ప్రధాని మోడీ ఏపీకి ఎలాంటి వరాలిస్తారో తనకు తెలియదన్నారు, అసలు ప్రధాని వరాలు ప్రకటిస్తారో లేదో... చెప్పలేమంటూనే అనవసరంగా మాట్లాడి ఆశలు కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో వివాదం నడుస్తుండటంతో వెంకయ్యనాయుడు ఆచితూచి మాట్లాడారు.
అయినా ఆర్దిక వసతులు, మనకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేసుకోవడమే మంచిదన్నారు. లక్షల కోట్లు అంటూ ఆశలు పెంచి... ఆ తర్వాత నెరవేర్చకపోతే నిరుత్సాహం వస్తుందని వ్యాఖ్యానించారు. ముందుగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న వెంకయ్యనాయుడు... ఈమధ్య కాలంలో కొత్తగా నిర్మించిన నయా రాయపూర్, అహ్మదాబాద్, డెహ్రాడూన్ లకు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదని, కేవలం సహకారం మాత్రమే అందించిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు, రాష్ట్ర ప్రభుత్వ ఆశలకు భిన్నంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీకి మోడీకి ఎలాంటి ప్రత్యేక వరాలు ప్రకటించే అవకాశం లేదంటున్నారు.