కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

 

నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.  రెండు రోజుల క్రితం నిజామాబాద్‌ పట్టణంలో కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై దాడి చేసిన రియాజ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే రౌడీ షీటర్‌ రియాజ్‌ ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్‌ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే క్రమంలో రియాజ్‌ను పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తిపై రియాజ్‌ దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి.

అనంతరం పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకొని నిందితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ రోజు ఉదయం రియాజ్‌ నాలుగు రకాల ఎక్స్‌రేలు తీసినట్లు అధికారులు తెలిపారు.

అయితే చికిత్స సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ తుపాకీ లాక్కొని పారిపోవడానికి రియాజ్‌ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా రియాజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్‌ జరిపిన కాల్పుల్లో ఏఆర్‌ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu