దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు దంపతులు

 

విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డాటా సెంటర్ రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు మూర్ఖులు రాజకీయ కక్షతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు వల్ల 12 దేశాలకు సేవలు అందుతాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల, విదేశాల్లో పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి కూడా ఇదే కావడం గర్వకారణమన్నారు. 

హైదరాబాద్‌ అభివృద్ధి వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం అక్కడి నుంచే వస్తోందని, ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీని ఏఐకి చిరునామాగా మారుస్తామని స్పష్టం చేశారు. ఏఐ వల్ల రాబోయే పదేళ్లలో ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని... ప్రపంచంలోనే తెలివైన వారికి చిరునామాగా ఏపీ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.

 విజయవాడ పున్నమి ఘాట్‌లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి క్రాకర్ షోను వీక్షించారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

రాక్షసుణ్ని ప్రజలు ఓటుతో తరిమేశారు

ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పట్టి పీడించిన రాక్షసుణ్ని ప్రజలు ఓటు ఆయుధంతో తరిమేశారని, ఎన్డీఏ కూటమిని 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి వద్దు. డబుల్ ఇంజన్ సర్కారుతో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుతోంది. 2019-24 మధ్య ప్రజలెవరూ సంతోషంగా పండుగలే జరుపుకోలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలంతా సుఖంగా ఉన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవాలు దసరాతో ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు ఆదా అవుతోంది. దీపావళి పండుగ ఒక సందేశం ఇస్తుంది. నరకాసురుడు సమాజాన్ని అతలాకుతలం చేస్తే శ్రీ కృష్ణుడు ఆ రాక్షుసుణ్ణి వధించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అదే దీపావళిగా జరుపుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం

‘15 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. తల్లికి వందనం, పింఛన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 , అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలన్నీ అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ ఇస్తున్నాం. 

ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవం పెంచేలా రీ డిజిగ్నేట్ చేస్తాం. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య సహా ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాం. తెలుగుజాతి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. 

మోదీ సారధ్యంలో మనదేశం 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. 2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. ’అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పున్నమి ఘాట్‌లో నిర్వహించిన క్రాకర్ షోను అనాథ పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వీక్షించారు.

బీసెంట్ రోడ్డులో సీఎం

దీపావళీ వేడుకలకు హజరయ్యే ముందు బీసెంట్ రోడ్డులో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. 

చింతలపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జ్యూట్ బ్యాగులు విక్రయిస్తానని తెలిపారు. ఆయనకున్న సమస్యలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి యక్కలి బాలకృష్ణతో మాట్లాడారు. చదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోన్న గొడవర్తి లక్ష్మీ అనే మహిళతో ముఖ్యమంత్రి మాట్లాడారు. 

అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో చంద్రబాబు ముచ్చటించారు. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ఎంత వరకు ఉందని, ధరల వ్యత్యాసం గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏ మేరకు ఉన్నాయనే అంశాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్‌కు వచ్చిన పలువురు కొనుగోలు దారులనూ సీఎం పలకరించారు. వారితో ఫోటోలు దిగి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu