జగన్ రెడ్డి గుండెల్లో ఆత్మ ప్రబోధం గుబులు!

జగన్ తన నీడను చూసి తానే భయపడుతున్నారు. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో భయం ఎంతగా ఉందంటే  సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మలేక పోతున్నారు. పట్టభద్రుల మొట్టికాయల తర్వాత  జగన్ రెడ్డిలో ముందున్న 175/175 ధైర్యం మటుమాయమైందని  పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.  మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన వందకు ‘వంద’శాతం ఓటమి జగన్ రెడ్డిని కంగు తినేలా చేసిందనీ,ఈ నేపధ్యంలో  మరో రెండు రోజులలో అంటే గురువారం (మార్చి23)  జరిగే,ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎమ్మెల్యేలు ఏమీ చేస్తారో అనే భయం జగన్ రెడ్డిని వెంటాడుతోందని అంటున్నారు.

నిజానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న కారణంగా  వైసీపీ ఎమ్మెల్యేలలో అసమ్మతి పెద్దగా పైకి కనిపించక పోయినా  ప్రతి జిల్లాలోనూ అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గడపగడపకు రివ్యూ పేరిట నిర్వహించిన సమావేశాలలో ముఖ్యమంత్రి తమను చులకన చేసి మాట్లడిన తీరును, గడపగడపకు టెస్టులో మార్కులు తెచ్చుకోక పోతే మళ్ళీ పార్టీ టికెట్ రాదని అందరి ముందు అవమాన పరిచిన తీరును ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీలు మరిచి పోలేకుండా ఉన్నారని అంటున్నారు. అందులో ఒకరిద్దరు అటూ ఇటూ అయినా, జగన్ రెడ్డి ఇమేజ్  డ్యామేజి కావడమే కాకుండా పార్టీలో ఇంతవరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్క సారిగా భగ్గు మంటుందని  అందుకే ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అనుమానిత  ఎమ్మెల్యేలు మంత్రులపై  పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.  

నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ మనసులోని భయాన్ని మరో రూపంలో బయట పెట్టుకున్నారు. తెలుగు దేశం పార్టీ తమ పార్టీ  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తోందని, తాడేపల్లి ప్యాలెస్ సన్నిహిత నేతలు ఆరోపిస్తున్నారు.  అయితే, నిజానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని  ఇప్పటికే నలుగు టీడీపీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్న  వైసీపీయే  అలాంటి ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీది కేవలం ఆరోపణ కాదు. అదే నిజం. 

ఎమ్మెల్యేల కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తేనే విజయం వరిస్తుంది. వైసీపీ ఏడు స్థానాలకూ అభ్యర్థులను నిలిపింది. 22 మంది ఎమ్మెల్యేల చొప్పున 154 ఓట్లు పడితేనే అందరూ గెలిచే అవకాశం ఉంటుంది.  వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 151 మాత్రమే. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలూ (వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం) ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. జనసేన ఏకైక సభ్యుడు రాపాక వరప్రసాద్‌ సైతం వైసీపీతోనే ఉండడంతో తమ పార్టీ అభ్యర్థులు ఏడుగురూ గెలుస్తారని జగన్‌ రెడ్డి లెక్కలు వేశారు. సొంత బలం లేకున్నా సంతలో కొనుక్కున్న ఎమ్మెల్యేల అండ చూసుకుని ఏడవ అభ్యర్ధిని బరిలో దించారు.

మరో వంక ప్రతిపక్ష టీడీపీకి సాంకేతికంగా సరిపడిన సంఖ్యా బలం ( 23 మంది) ఉన్నందున  బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను పోటీకి దించింది.అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవంక వైసీపీ నుంచి  ఇప్పటికే బయట పడిన నెల్లూరు జిల్లా అసమ్మతి ఎమ్మెల్యేలు, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారనే నమ్మకం లేదు. నిజానికి ఆ ఇద్దరు ఇప్పటికే అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు. ఆ ఇద్దరూ టీడీపీ అభ్యర్థికి  ఓటేస్తే ప్రతిపక్షం బలం 21కి చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది.  పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపుతో ఊపుమీదున్న సైకిల్‌ వైపు వైసీపీ ఎమ్మెల్యేలెవరైనా మొగ్గితే..  వైసీపీ అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోతారు. అదే జరిగితే పార్టీ మీద ముఖ్యమంత్రి పట్టు తప్పే ప్రమాదముంది. అందుకే  జగన్ రెడ్డి ఎమ్మెల్యేల పై ప్రత్యేక నిఘా పెట్టారని అంటున్నారు.  ముఖ్యంగా, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున..  గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి ఓటేస్తారో లేదోనని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. ఈ అందరిపైన పోలీసు నిఘాతో పాటుగా పార్టీ నిఘా కూడా కొనసాగుతోందని అంటున్నారు.

టీడీపీలో గెలిచి వైసీపీతో సఖ్యతగా ఉన్న ఒక ఎమ్మెల్యే సైతం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  దీంతో ఆయన్ను కూడా ఓ కంట కనిపెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గురువారం (మార్చి23)   జరిగే ఎమ్మెల్యే ఓటింగ్‌కు హాజరు కావాలని వైసీపీ నాయకత్వం పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది.  అయితే, ఏమి చేసినా ఇప్పటికే మనసు విరిగిన ఎమ్మెల్యేలు, ఎటూ టికెట్ రాదని నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, టికెట్ వచ్చినా వైసీపీ తరపున పోటీ చేయరాదనే నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇలా అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు,  ఆత్మ ప్రభోధం .. ప్రకారం ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.