కవిత కారు దిగిపోవడం ఖాయమేనా?
posted on Jul 5, 2025 3:38PM

కల్వకుంట్ల కవిత.. పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడిన కవిత.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కూడా. తండ్రి చాటు బిడ్డగానే రాజకీయాలలో తొలి అడుగులు వేసినా.. ఆ తరువాత ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బతుకమ్మ, బోనాల పండుగలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. లోక్ సభ సభ్యురాలిగా తన ప్రతిభనూ చాటారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
అటువంటి కల్వకుంట్ల కవిత ఇటీవల గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలే గత ఎన్నికలలో పరాజయంపాలై, అధికారానికి దూరమై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కవిత ధిక్కార ధోరణితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పైన, ఆ పార్టీ నాయకత్వం పైన కవిత చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు కవితను బీఆర్ఎస్ కే కాకుండా.. కేసీఆర్ కుటుంబానికి కూడా దూరం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. దీంతో కవిత పొలిటికల్ జర్నీపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ తన దేవుడంటూనే కవిత బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. దీంతో కేసీఆర్ కూడా కవితను దూరంపెడుతున్నారు. ఇందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న తరుణంలో తండ్రిని కలవడానికి వచ్చిన కవితవైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదు. చిన్న సైగతో ఆమె తన సమీపానికి కూడా రాకుండా నిలువరించారు. ఇక తాజాగా కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సందర్భంగా సొంత కుమార్తె అయి ఉండి కూడా ఎవరో పరాయి వ్యక్తిలా, అతిథిలా కవిత యశోదా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చేయాల్సి వచ్చింది.
వీటన్నిటికీ మించి ఇటీవల కవిత ఒక ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె కారు దిగిపోవడానికే నిర్ణయించుకున్నారని తేటతెల్లం అయ్యింది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆమె ఎంచుకున్న ఛానెల్.. అలాగే ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కవిత రాజకీయంగా బీఆర్ఎస్ తో కలిసి నడిచే పరిస్థితి ఎంత మాత్రం లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. భవిష్యత్ లో తాను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని అని కుండబద్దలు కొట్టడమే కాకుండా.. తన సోదరుడు కేటీఆర్ తో తనకు విభేదాలున్నాయని కూడా స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా మరో అడుగు ముందుకు వేసి ఆ ఇంటర్వ్యూలో తన తండ్రిపైనే విమర్శలను గురిపెట్టి వదిలారు. తన నియోజకవర్గ అభివృద్ధికి స్వయంగా తాను కోరినప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. ఇక బిఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిర చేస్తున్న.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కవిత పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే కవిత కారు దిగి సొంత దారి చూసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.