కవిత అరెస్టేనా?.. తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల అలర్ట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తెలంగాణ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయనుందా?   మంగళవారం ఉదయం కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ కొనసాగుతోంది. అయితే విచారణ అనంతరం ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఎందు కంటే తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో పోలీసులు, పారమిలిటరీ బలగాలే కనిపిస్తున్నాయి. గతంలో ఈడీ కవితను విచారించిన సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద మాత్రమే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ పరిసరాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించారు. అయితే ఇప్పుడు మాత్రం ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దే కాదు, తెలంగాణ వ్యాప్తంగా భద్రత పెంచారు. మరీ ముఖ్యంగా   హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఇక నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద అయితే పోలీసు, పారామిలిటరీ బలగాలకు తోడుగా బీజేపీయే ప్రైవేటు సెక్యూరిటీని అదనంగా నియమించుకున్న పరిస్థితి కనిపిస్తోంది.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ భద్రత పెంచాల్సిందిగా కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు భోగట్టా. అలాగే రాష్ట్రంలోని కీలక బీజేపీ నేతల నివాసాలు, కార్యాలయాల వద్ద కూడా అధనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  దీంతో ఈడీ కవితను అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.