చెడుగుడు ఆడుకొంటున్న కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీలు

 

ఇటీవల యుపీయే ప్రభుత్వానికి డీయంకే పార్టీ మద్దతు ఉపసహరించుకొన్ననాటి నుండి, యుపీయేకి బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో చెడుగుడు ఆడుకోవడం మొదలు పెట్టింది. అయితే ఆ ఆటను కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టడం విశేషం.

 

ఆ పార్టీకి చెందిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, సమాజ్ వాది పార్టీ తమకు మద్దతు ఇస్తున్నవిషయాన్నీ కూడా పట్టించుకోకుండా సమాజ్ వాది అధినేత ములాయం సింగుకు ఉగ్రవాదులతో సంబందాలు ఉన్నాయని, యుపీయేకు మద్దతు ఇచ్చేందుకు డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేయడంతో, బేణీ ప్రసాద్ వర్మ చేత వెంటనే క్షమాపణలు చెప్పించి ఆయనని పదవి నుండి వెంటనే తొలగించాలని లేకపోతే మద్దతు ఉపసంహరిస్తామంటూ సమాజ్ వాది పార్టీ బెదిరించేసరికి, ప్రధాని మన్మోహన్ సింగు, సోనియా గాంధీలిరువురూ కూడా ములాయం ముందు చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరక తప్పలేదు.

 

అయితే, తమను సీబీఐ చేత వేదిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్న సమాజ్ వాది అధినేత ములాయం మాత్రం బెట్టు సడలించలేదు. పైగా బీజేపీ నాయకుడు అద్వానీని పొగుడుతూ మాట్లాడి యుపీయే నుండి యన్డీయే వైపు జంపు చేస్తానని సూచన ప్రాయంగా తెలియజేసారు. దానితో అప్రమత్తమయిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయ పార్టీల కోసం వెదికినప్పుడు లలిత, మమత అనే ఇద్దరు వీరనారీ మణులు యుపీయే కు మద్దతు ఇచ్చేందుకు సిద్దమని సూచన ప్రాయంగా చెప్పడంతో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సమాజ్ వాది పార్టీతో చెడుగుడు ఆటకు దైర్యంగా సై అంది.

 

మొట్ట మొదట ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా 2014వరకు ఎటువంటి డోకా లేదని అన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషిద్ అల్వీ మాట్లాడుతూ ములాయం సింగ్ ఎన్డీయే వైపు చూడటాన్ని తప్పు పట్టారు.

 

మద్దతు ఉపసంహరిస్తామని బెదిరిస్తే బయపడుతుందనను కొన్న కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా ఎదురు దాడి మొదలుపెట్టేసరికి ములాయం సింగుకు కూడా పరిస్థితులు మళ్ళీ మారాయని అర్ధం అయ్యింది. తమ మద్దతే కనుక కాంగ్రెస్ అవసరం లేకపోతే, ఇక సీబీఐతో ఏమి కొత్త తంటాలు వస్తాయోనని బయపడిన ములాయం సింగ్ “యుపీయే ప్రభుత్వం పడిపోవాలని మేము కూడా కోరుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీతో మా సంబందాలు మరీ అంత ఘోరంగా ఏమి లేవు. ఇప్పటికీ చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చునని మేము నమ్ముతున్నాము,” అని ఆయన అన్నారు.

 

అయితే ఆయన ఆ మాట అన్న తరువాత కూడా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. మళ్ళీ బేణీ ప్రసాద్ వర్మ మీడియా ముందుకు వచ్చి “వచ్చే ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాది పార్టీకి మహా అయితే నాలుగో, ఐదో పార్లమెంటు సీట్లు రావచ్చును. ఎందుకంటే, ములాయం సింగ్ రాష్ట్ర ముస్లిం ప్రజలందరినీ మోసం చేసాడు. ఇప్పుడు ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా అదే పని చేస్తున్నాడు. అందువల్ల వచ్చే ఎన్నికల తరువాత ఆ పార్టీకి రాష్ట్రంలో అంత్యక్రియలు తప్పవు” అని అన్నారు. అందుకు ఆ పార్టీ నేతలు కూడా ఘాటుగానే స్పందించినప్పటికీ, ఈ సారి మాత్రం సోనియా గాంధీ కానీ, ప్రధాని గానీ మంత్రి బేణీ ప్రసాద్ మాటలకు విచారం వ్యక్తం చేయలేదు, కనీసం ఖండించ లేదు కూడా.

 

కాంగ్రెస్ పద్దతి ఎలా ఉందంటే ఏరు దాటేవరకు ఏటి మల్లన్న, ఏరు దాటగానే బోడి మల్లన్న అంటున్నట్లుందని ఒక పక్క విమర్శిస్తూనే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకే సమాజ్ వాది పార్టీ మళ్ళీ సిద్దపడటం చూస్తే బహుశః సీబీఐ భయం వలననే అయిఉండాలి. కానీ అదే సమయంలో నవంబర్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ములాయం సింగ్ జోస్యం కూడా చెప్పడం మరో విశేషం.