గుంటూరు జిల్లా కాంగ్రెస్ సమావేశం రచ్చ రచ్చ

 

 

Mopidevi’s brother expresses anger at his imprisonment

 

 

గుంటూరులో జరిగిన డీసీసీ సమావేశం ఒక్కసారిగా రసాభాసాగా మారింది. తమ సోదరుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముప్పయ్యేళ్లుగా కాంగ్రెసు పార్టీలో ఉండి సేవ చేస్తే ఆయనను జైలులో పెడతారా? అంటూ ఆయన తమ్ముడు మోపిదేవి హరినాథ్ తీవ్రంగా మండిపడ్డారు.

 

డిసిసి సమావేశంలో ఎవరి సమస్యలు వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా మోపిదేవి హరినాథ్ లేచి తన సోదరుడు కాంగ్రెసు పార్టీ కోసం కష్టపడ్డారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు జైలులో ఉంటే ఎవరు స్పందించరా? అని సమావేశంలో నిలదీశారు. నాటి జివోలతో సంబంధమున్న మంత్రులను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తన సోదరుడు ఒక్కడినే ఎందుకు బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లాలో ఇద్దరు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన నేత అకారణంగా జైలులో ఉంటే పట్టించుకోరా అని నిలదీశారు. ఆయనను బయటకు తీసుకు వచ్చేందుకు అందరం కలిసి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలని ఆయన సూచించారు. పార్టీలో బిసిల పట్ల చిన్న చూపు కనిపిస్తోందన్నారు. హరినాథ్ ఆవేదన వ్యక్తం చేస్తుండగా కొందరు నేతలు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సమావేశాన్ని వాయిదా వేశారు.