బెయిల్ దొరికినా విడుదలకు జాప్యం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి హైకోర్టు నిన్నబైయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ కి బెయిల్ దొరికినా జైలు నుండి విడుదలవడానికి మాత్రం జాప్యం జరుగుతుంది. నిజానికి నిన్న రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన తరువాత వెంటనే జైలు నుండి విడుదలవుతారని అటు కుటుంబసభ్యులు, ఇటు అభిమానులు, తెదేపా పార్టీ శ్రేణులు ఎదురుచూశారు కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులలో లోపం ఉండటం వల్ల నిన్న కూడా రేవంత్ రెడ్డి జైలులోనే ఉండాల్సివచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిలో రేవంత్ రెడ్డి వ్యక్తిగత పూచీకత్తుని ఎసిబి కోర్టుకి ఇవ్వాలని వ్రాయవలసి ఉండగా, ఎసిబికి ఇవ్వాలని ఉండటంతో కోర్టు దానిని తిరస్కరించింది. ఈ కారణంగా రేవంత్ రెడ్డి నిన్న కూడా జైలులోనే ఉండాల్సి వచ్చింది. మరోవైపు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి విడుదలకు జాప్యం అవుతుందనే అనుమానాలు తలెత్తున్నాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో పూచికత్తు సమర్పించడం లో సమస్య వస్తుందా?వారు అంగీకరించకపోతే, ఒకవేళ అంగీకరించినా, ఆలస్యం చేస్తే రేవంత్ విడుదల జాప్యం అవుతుందన్న అనుమానం ఉంది. దీంతో రేవంత్ ఈ రోజు సాయంత్రానికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి తనకు బెయిల్ వచ్చిన తరువాత జైలులో ఉన్నప్పుడు తాను ఉపయోగించిన వస్తువులన్నింటిని తోటి ఖైదీలకు ఇచ్చేశారంట. కానీ మంగళవారం రాత్రి కూడా అక్కడే ఉండాల్సి రావడంతో వాటిని తీసుకున్నవారు మళ్లీ తెచ్చిచ్చినట్లు సమాచారం.