బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి.. రేవంత్ డిమాండ్ తో బీజేపీ ఇరుకున పడ్డట్టేనా?
posted on Jul 24, 2025 9:49AM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన తాజా డిమాండ్ తో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ నే కాదు, బీజేపీ హైకమాండ్ ను కూడా ఇరుకున పడేశారు. తన రాజకీయ చాణక్యం ప్రదర్శించి.. కేంద్రంలో తీవ్ర ఒత్తిడి తీసుకుస్తున్నారు. కులగణనపై కేంద్రం మెడలు వంచుతామంటూ గర్జించారు. హస్తినలో మీడియా సమావేశం పెట్టి మరీ ఉపరాష్ట్రపతి పదవిని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవిని బీసీలతో లింక్ పెట్టి కేంద్రాన్ని ఇరుకున పెట్టారు.
దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా బీసీలను గౌరవించినట్లే కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లు అవుతుందని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు బీసీల నాయకత్వాన్ని అణచివేస్తున్నారని ఆరోపణ చేయడమే కాకుండా..ఈ సందర్భంగా బండి సంజయ్ ను ప్రస్తావించారు. బీసీలకు పెద్ద పీట వేసేందుకు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఇండియా కూటమి పార్టీలతో తానే మాట్లాడి మద్దతు లభించేలా చేస్తానన్నారు. బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి అంటూ రేవంత్ చేసిన డిమాండ్ బీజేపీకి గొంతులో పచ్చవెలక్కాయపడినట్లు చేసిందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతి పదవి విషయంలో బీజేపీ చాలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వ్యూహాత్మకంగా పలు పేర్లను ప్రచారంలోకి తెస్తున్నది. అయితే బీజేపీ ప్రచారంలోకి తీసుకువస్తున్న పేర్లలో బండారు దత్తాత్రేయ పేరు మాత్రం లేదు.
బండారు దత్తాత్రేయకు పదవీవిరమణ వయస్సు దగ్గరపడుతోంది. ఇప్పటికే హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లకు గవర్నర్ గా పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ పరిశీ లించే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా బీసీల విషయంలో బీజేపీ అన్యాయం చేస్తున్నదంటూ ఆ పార్టీ హైకమాండ్ ను ఎండగట్టడమే లక్ష్యంగా రేవంత్ ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.