ఇరాన్- ఇజ్రాయేల్ వార్ లో అమెరికా ఎంట్రీ ఎందుకంటే?

అమెరికా అధ్య‌క్షుడు జీ7 నుంచి హ‌డావిడిగా అమెరికా బ‌య‌లు దేరారు. ఇంత‌లో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మెక్రాన్ ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కోస‌మేమో  ఈ తొంద‌ర అని అన్నారు. లేదు లేదు అంత‌క‌న్నా మించి అన్నది ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య.  ఇక్క‌డ యూఎస్ కి చేరుకోగానే సిట్యువేష‌న‌ల్ రూమ్ ని ఏర్పాటు చేశారు ట్రంప్. ఇప్ప‌టికే  ఇజ్రాయెల్ టెహ్రాన్ గ‌గ‌న త‌లాన్ని త‌న  కంట్రోల్లోకి తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ట్రంప్ కూడా ట్రెహ్రాన్ లో నివ‌సించేవారంతా ఆ ప్రాంతం వ‌ద‌లి  వెళ్లాల్సిందిగా హెచ్చ‌రించారు.

కార‌ణం.. ఇక్క‌డికి 225 కి. మీ ద‌గ్గ‌ర్లో ఇరాన్ కి చెందిన‌ న‌టాంజ్ అణు కేంద్రం ఉంటుంది. ఇక వంద కి. మీ. దూరంలో ఉండేది  ఫార్దో. ఇదీ ఒక‌ అణు కేంద్రమే. ఇక్క‌డ యురేనియం శుద్ధి సుమారు 83 శాతం చేసింది ఇరాన్. యురేనియం 90 శాతం శుద్ది అయితే చాలు ఒక అణుబాంబు త‌యారు చేయ‌డానికి. అంటే దాదాపు ద‌గ్గ‌ర‌కొచ్చేసింద‌న్న‌మాట‌.  ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పే మాట ఏంటంటే  అణ్వాయుధం ఇరాన్ కి ఎట్టి  ప‌రిస్థితుల్లోనూ  ద‌క్క కూడ‌ద‌ని. ఎందుక‌లా? కార‌ణాలు ఏమై ఉంటాయి? అంటే..
మొద‌ట కొన్నాళ్ల  నుంచి ఇరాన్- యూఎస్ మ‌ధ్య అణు ఒప్పందం పెండింగ్ లో ఉంది. ఇందుకు ఇరాన్ ఎట్టి  ప‌రిస్తితుల్లోనూ ఒప్పుకోవ‌డం లేదు. పాయింట్ నెంబ‌ర్ టూ  పాకిస్థాన్ లా మ‌రో ఇస్లామిక్ కంట్రీ  ద‌గ్గ‌ర అణ్వాయుధం ఉంటే  ప‌రిస్థితి  మ‌రోలా మారిపోతుంది. 1960ల నాటి ఆయుధ శ్రేణి ఫైట‌ర్ జెట్లు ఉండ‌గానే ఇరాన్ ఇటు పాల‌స్తీనా హ‌మాస్ కి, అటు లెబ‌నాన్ హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాల‌ు అందజేయడంతో పాటు  శిక్ష‌ణ  కూడా ఇస్తోంది. ఇది అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్ కి ఎంత మాత్రం క్షేమ‌క‌రం కాదు. దీంతో ఇస్లామిక్ విప్ల‌వం మ‌రింత ముదిరే అవ‌కాశ‌ముంది.

బేసిగ్గా ఇరాన్, ఇజ్రాయెల్ 1979 వ‌ర‌కూ మిత్ర‌దేశాలే. ఎప్పుడైతే 1980ల్లో ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ వ‌చ్చిందో  అప్ప‌టి నుంచీ ఇజ్రాయెల్ తో వ‌ర్గ  శ‌తృత్వం ఏర్ప‌రుచుకుంది ఇరాన్. దీంతో అమెరికా  ఇరాన్ అంటేనే భ‌య‌ప‌డుతోంది. ఆ దేశానికి అణ్వాయుధం అంటేనే హ‌డ‌లిపోతోంది. ఇది మ‌రింత ఇస్లామిక‌ర‌ణ‌కు ఆస్కారం ఏర్ప‌రుస్తుంద‌న్న ఆందోళ‌న  చెందుతోంది యూఎస్. 

దీంతో ఆగ‌మేఘాల మీద ఈ  యుద్ధంలోకి త‌న వంతుగా ఏర్పాట్లు చేస్తున్నారు ట్రంప్. అయితే ఇరానీ అణు నిల్వ‌లున్న న‌టాంజ్, ఫోర్దోగానీ భూమిలోలోతుల్లో భ‌ద్ర ప‌ర‌చ‌బ‌డ్డాయి. వీటిని బ‌ద్ధ‌లు కొట్టాలంటే అమెరికా ద‌గ్గ‌రున్న బంక‌ర్ బ్లాస్ట‌ర్ల ద్వారా మాత్ర‌మే సాధ్యం. ఇవి ఇర‌వై అడుగుల పొడ‌వుండే జీబీయూ 57 అనే భారీ బంక‌ర్ బ్లాస్ట‌ర్ల ద్వారా మాత్రమేపేల్చాల్సి ఉంటుంది. 

ఈ బంక‌ర్ బ్లాస్ట‌ర్లు ఒక్కొక్క‌టీ 13 వేల 600 కిలోల బ‌రువుంటాయి. వీటిని అమెరిక‌న్ బీ2 స్పిరిట్ బాంబ‌ర్ల ద్వారా మాత్ర‌మే ప్ర‌యోగించ‌గ‌లం. వీటిని కొన్ని నెల‌ల క్రిత‌మే ప‌శ్చిమాసియాకు చేర్చింది యూఎస్. విమాన వాహ‌క నౌక యూఎస్ఎస్ నిమిట్స్ ని ఈ స‌రికే  ప‌శ్చిమాసియా తీరానికి  త‌ర‌లించింది  అమెరికా. ఇత‌ర స‌హాయ‌క నౌక‌లు సైతం ఈ దిశగా క‌దిలాయి. అంతే  కాదు బ్రిట‌న్ జెట్ ఫైట‌ర్లు కూడా  మొహ‌రిస్తున్నారు.

ఇలా అన్నిర‌కాలుగా  ఇరాన్   అణ్వాయుధ త‌యారీ చేయ‌కుండా క‌ట్ట‌డి చేస్తోంది యూఎస్. అందులో భాగంగా మొద‌ట త‌మ మిత్ర దేశం ఇజ్రాయెల్ ని రంగంలోకి దింపింది. ఇదొక ఎమోష‌న‌ల్ డ్రామా. ఇక్క‌డ గానీ చిక్కితే.. మొద‌ట అణు ఒప్పందం గురించి అడ‌గొచ్చు. లేదంటే త‌ను కూడా ఇదే యుద్ధంలోకి దిగి ఇరాన్ ప‌ని  ప‌ట్టొచ్చ‌ని భావిస్తోంది యూఎస్.. అందుకే ఈ  ఉరుకులు ప‌రుగుల నిర్ణయాలుగా అంచ‌నా వేస్తున్నారు.. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల  నిపుణులు.