రాహుల్ గాంధీ ఏం పింగళించాడో!



సింగడు అద్దంకి పోనూ పోయాడు.. రానూ వచ్చాడు అనే సామెత మన తెలుగువాళ్ళందరికీ బాగా తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో పర్యటించి వెళ్ళిన రాహుల్ గాంధీని చూస్తే ఆ సామెత మరోసారి గుర్తొచ్చింది. ఈ సందర్భంగా మన సామెత మనకు మరోసారి గుర్తొచ్చేలా చేసిన రాహుల్ గాంధీకి థాంక్స్. ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీ తెలంగాణకు రాను వచ్చాడు.. పోనూ పోయాడు.. ఆయన సాధించింది మాత్రం ఏమీ లేదు. ఆయన ఇక్కడికొచ్చి పింగళించింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు వెయ్యిమందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. మరి రాహుల్ గాంధీ తన పర్యటన సందర్భంగా ఐదుగురు రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తే సరిపోతుందా?  రైతుల మీద కాంగ్రెస్ నాయకులకు అంత లవ్వు వుంటే చనిపోయిన వెయ్యి మంది రైతుల కుటుంబ సభ్యులనీ రాహుల్ గాంధీ ముందు నిలబెట్టి అందరికీ ఆర్థిక సాయం అందించవచ్చు కదా.

అసలు రాహుల్ గాంధీ వచ్చి రైతుల కుటుంబాలను ఓదార్చినంత మాత్రాన, రైతులకు భరోసా ఇచ్చినంత మాత్రాన ఒరిగిందీ, ఒరిగేదీ ఏమీ లేదు. తెలంగాణలో ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ, రాహుల్ గాంధీ గాని రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వగలరు? అధికార టీఆర్ఎస్‌ని చూస్తేనే కాంగ్రెస్‌కి గుండె దడ పుడుతోంది. ఇలాంటి కాంగ్రెస్ తమకు భరోసా ఇవ్వగలదని రైతుల భావించగలరా? రాహుల్ గాంధీ పర్యటించిన రోజునే తెలంగాణలో ఇద్దరు రైతులు ఆత్యహత్య చేసుకున్నారని వార్తలు వచ్చాయి. మరి రాహుల్ గాంధీ రాక ఆ రైతుల జీవితాలలో బతకాలన్న ఆశ ఎందుకు కల్పించలేకపోయింది? అందుకని రాహుల్ గాంధీ గానీ, ఆయన్ని బతిమాలి తెలంగాణకు తీసుకొచ్చిన కాంగ్రెస్ నాయకులుగానీ అర్థం చేసుకోవాల్సింది  ఒక్కటే.. మీరు రైతులకు భరోసా కల్పించే పేరుతో ఒక రాజకీయ యాత్ర నిర్వహించారు. తెలంగాణలో రైతుల ఆత్యహత్యలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. అయితే మీ ప్రయత్నాలు అన్ని వృధానే.. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు తెలుగువారెవ్వరూ నమ్మడం లేదు. అంచేత, రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల కాళ్లు నొప్పులు రావడం మినహా వచ్చేదేమీ లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu