చైనాని నమ్మొద్దు గురూ...




మన ప్రధాని నరేంద్రమోడీ తీరు కొంచెం విచిత్రంగా వుంటుంది. ఆయన కొంతమందిని నిజంగానే నమ్మతాడో, నమ్మినట్టు నటిస్తాడో, నమ్ముతున్నట్టు మనల్ని నమ్మిస్తాడో అర్థంకాదు. ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినవాళ్ళతో స్నేహం చేస్తూ వుంటాడు. మొన్నటి వరకూ మోడీని ప్రధానమంత్రి కాకుండా చేయాలని కంకణం కట్టుకున్నవాళ్ళతో కూడా చాలా స్నేహంగా వ్యవహరిస్తూ వుంటాడు. వాళ్ళు ఏదైనా విజయం సాధిస్తే అర్జెంటుగా ఫోన్ చేసో, అయినదానికి కానిదానికీ ఒకటి వుంది కదా... ట్విట్టర్.. దాంట్లోనే అభినందనలు తెలియజేస్తాడు. అసలు దీన్నే రాజకీయం అంటారేమో. శత్రువుని కూడా అభినందించాలంటే దానికి చాలా రాజకీయ పరిణతి వుండాలి. అది మోడీగారికి బాగా ఎక్కువే అని అర్థమవుతోంది.

సరే, దేశంలో వున్న రాజకీయ శత్రువుల విషయంలో ఆయన ఎలా వ్యవహరించినా ఓకే, కానీ ఇండియాని ఎలా నాశనం చేద్దామా అని ఆలోచించే పాకిస్థాన్, చైనాల విషయంలో కూడా ఆయన ఇదే వ్యవహార శైలిని ప్రదర్శిస్తూ వుండటం మాత్రమే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది. పాకిస్థాన్ స్నేహం అంటూనే వుంటుంది... సరిహద్దుల్లో, ఇండియాలో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూనే వుంటుంది. చైనా కూడా తక్కువదేమీ కాదు.. మహా చుప్పనాతి దేశం.  ఇండియా చైనా భాయీ భాయీ అంటూనే గోతులు తవ్వుతూ వుంటుంది. సరిహద్దులు దాటి ఇవతలి వచ్చి ఆక్రమిస్తూనే వుంటుంది. ఇలాంటి దేశాలతో మోడీ స్నేహం పెంచుకోవాలని ప్రయత్నించడం వృధా ప్రయాసే అవుతుందన్న అభిప్రాయాలు వున్నాయి. మొన్నామధ్య పాకిస్థాన్ ప్రధానితో స్నేహ సంబంధాలు నెరపినా, ఆ దేశంలో ఎలాంటి మార్పు అయినా వచ్చిందా? ఇప్పుడు నరేంద్ర మోడీ చైనాలో పర్యటించినంత మాత్రాన ఆ దేశం బుద్ధి మారుతుందా? అలా మారుతుందన్న నమ్మకం చైనా గురించి బాగా తెలిసిన ఏ భారతీయుడికీ లేదు. మరి మోడీగారు చైనాని ఎందుకు నమ్ముతున్నారో, లేదా నమ్మినట్టు నటిస్తున్నారో అర్థం కాని విషయం. అంచేత మోడీ గురూజీ, చైనా వెళ్ళిరండి.. తప్పేమీ లేదు.. కానీ ఆ దేశాన్ని మాత్రం నమ్మకండి.. మనం చైనా ఫోన్‌ని నమ్మం... అలాగే చైనాని కూడా నమ్మకూడదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu