ఎంసెట్... హాంఫట్...
posted on May 16, 2015 11:18PM

ఎంసెట్‌కి యమగండం వచ్చినట్టుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎంసెట్‌కి ది ఎండ్ చెప్పేట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ ఎంసెట్ ప్రక్రియ ఇంతకాలం నిరాటంకంగా, నిరభ్యంతరంగా కొనసాగుతూ వచ్చింది. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ చదువులు చదవాలంటే ఎంసెట్ అనే పెద్ద అడ్డు గోడను దాటాల్సిన అవసరం వుండేది. ఆ రోజుల్లో సీట్లు తక్కువ, పోటీ ఎక్కువ కావడం వల్ల ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి అర్హులను మాత్రమే ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లోకి తీసుకునేవారు. అలా ఫిల్టరింగ్ కోసం ఎంసెట్ బాగానే ఉపయోగపడింది. అయితే రానురాను ఎంసెట్ అనేది ఒక అనవసరపు ప్రక్రియగా మారిపోయింది. ఎంసెట్‌లో ఎంతో దారుణమైన ర్యాంక్ వచ్చినప్పటికీ డబ్బులుంటే మేనేజ్‌మెంట్ కోటాలో చదువుకుని డాక్టర్లో, ఇంజనీర్లో అయిపోయే గొప్ప రోజులు వచ్చిన తర్వాత ఎంసెట్ అవసరం ఇంకా ఏముంటుందన్న అభిప్రాయాలు వున్నాయి. పైగా ఇప్పుడు ఎటు చూసినా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలే. చదివేవాళ్ళే తగ్గిపోయారు. మరి అలాంటప్పుడు ఇక ఎంసెట్‌ల గోల ఎందుకన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఎంసెట్ అంటే కోచింగ్ సెంటర్ల వాళ్ళకు కామధేనువు అయిపోయింది. ఎంసెంట్ కోచింగ్ కోసం విద్యార్థులకు లేనిపోని మానసిక ఒత్తిడి ఒకటి. ఇలా అనేక కోణాలను పరిశీలించిన అనంతరం ఎంసెట్‌కి మంగళం పలకడమే ఉత్తమం అన్న అభిప్రాయానికి రెండు రాష్ట్రాల్లోని ఏలినవారు వచ్చారని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే విద్యా సంవత్సరానికే ఎంసెట్ హాంఫట్ అయ్యే అవకాశం వుందని సమాచారం.