ఇలా చేస్తే.. మీ భాగస్వామి ఎప్పటికీ మిమ్మల్ని వదలిపెట్టరు..!
posted on Sep 16, 2025 11:32AM

ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఎవరికి వారు ప్రత్యేకమైనవారు. అందుకే ఏ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఒకేలా ఉండలేరు అని అన్నారు. ఈ తేడాలు మొదట్లో బంధాల మధ్య ఆకర్షణను సృష్టిస్తాయి. కానీ తరువాత ఈ తేడాలు పగ లేదా సంఘర్షణకు కూడా కారణం కావచ్చు. కానీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి బదులుగా, ఈ తేడాలను తెలివిగా ఉపయోగించడం వలన బంధం మరింత బలపడుతుంది. ఏదైనా ఒక గొడవ జరగగానే అది చిన్న గొడవే అయినా సరే.. వీళ్లతో కలిసి ఉండలేం.. విడిపోదాం అనే ఆలోచన చాలా మందికి పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడూ అయినా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాలో అవ్వాలి.
తేడాలు?
కొంతమంది తమ జీవితాలను క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు, మరికొందరికి మార్పు, స్వేచ్ఛ అవసరం. కొందరు స్వభావరీత్యా ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు గందరగోళంలో కూడా ఓదార్పు కావాలి అనుకుంటారు. విభిన్న స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, వారికి తేడాలు ఉండటం సహజం. అయితే ఇది చెడ్డ విషయం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఒక అవకాశం అనుకోవాలి. అప్పుడు ఈ తేడాల వల్ల గొడవలకు బదులు అర్థం చేసుకునే గుణం అలవాటు అవుతుంది
తేడాలను ఎలా నిర్వహించాలి?
వ్యక్తుల మధ్య తేడాలు ఉన్నప్పుడు అది సంబంధంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తేడాలు తలెత్తినప్పుడు వెంటనే ఏదో ఒకటి స్పందించడం కంటే తగిన విధంగా రియాక్ట్ కావడం ముఖ్యం.
మార్పు కాదు.. సమన్వయం కావాలి..
భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించే బదులు వారితో సమన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇద్దరూ సరిగ్గా ఒకేలా ఉండనవసరం లేదు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రయత్నం చేయడం ముఖ్యం.
తిరస్కారం కాదు..అంగీకారం ముఖ్యం..
భాగస్వామిని వారు ఉన్న విధంగానే అంగీకరించండి. ఒకరి అంతర్గత స్వభావాన్ని మార్చమని బలవంతం చేయడం మంచిది కాదు. భాగస్వామిని వారి లోపాలతో అంగీకరించినప్పుడే నిజమైన ప్రేమ ఉన్నట్టు అర్థం. తేడాలు ఉంటే వాటిని ఇబ్బందిగా కాదు.. వాటిని ఇద్దరూ మానసికంగా డవలప్ అవ్వడానికి అవకాశంగా చూడాలి. వాటిని పోరాడటానికి కారణాలుగా కాకుండా, ఒకరి నుండి ఒకరు నేర్చుకుని ఇద్దరి పరిధులను విస్తరించుకునే అవకాశాలుగా పరిగణించాలి.
సంభాషణాత్మకంగా, కరుణతో ఉండాలి..
గొడవ జరిగినప్పుడు ఇరిద్దరూ భిన్నంగా ఉన్నారని తెలియజేసే సమాచారంగా దాన్ని చూడాలి. ఒకరినొకరు అగౌరవపరచకుండా మీ దృక్పథాన్ని వ్యక్తపరచాలి. భాగస్వామిని మీలాగే ఉండమని బలవంతం చేయకుండా ప్రేమ, కరుణతో వారికి సపోర్ట్ ఉండాలి.
అతను నాలాగా లేడు, ఆమె నాలాగా లేదు.. అతని పద్దతి నాకు నచ్చట్లేదు.. ఆమె అలవాట్లు బాలేవు.. ఇలా అనుకోవడం మానేయాలి. మనం మనకు ఎలా నచ్చుతామో.. వారికి కూడా వారంటే ఇ,్టం, వారి అలవాట్ల పట్ల ఒక కారణం ఉంటుంది. దాన్ని చూపించి వ్యతిరేకించకూడదు. ఇద్దరూ ఒకరినొకరు అంగీకరించాలి. అంగీకరించడం అంటే వ్యక్తి అలవాట్లు, ప్రవర్తన, పద్దతి తో సహా.. అన్నీ అంగీకరించడం. ఇలా చేస్తే గొడవ జరిగినప్పుడు ఇది తన పద్దతి అనే విషయం అర్థమై దాన్ని విడిపోదాం అనే ఆలోచన వరకు తీసుకెళ్లరు.
*రూపశ్రీ.