ఇంజనీర్స్ డే.. భారతదేశపు మోడర్న్ విజార్డ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..!

 


ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న భారతదేశంలో ఇంజినీర్స్ డే ని ఎంతో గౌరవంగా జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశంలోని మహానీయ ఇంజనీరు, రాష్ట్రనిర్మాణ శిల్పి, గొప్ప దూరదృష్టి కలిగిన శాస్త్రవేత్త భారతరత్న గ్రహీత మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి.  ఈయన జయంతి  సందర్భంగా ఇంజనీర్స్ డే నిర్వహించబడుతుంది. ఆయన గౌరవ సూచకంగా 1968,  సెప్టెంబర్ 15 నుండి  ఇంజినీర్స్ డే జరుపుకోవడం ప్రారంభమైంది.

మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విశిష్టత..

విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముడ్డెనహళ్ళి గ్రామంలో జన్మించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేసిన వినూత్న కృషి కారణంగా “భారతదేశపు మోడర్న్ విజార్డ్”  అని  ఆయన్ను పిలుస్తారు.

మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కేవలం ఒక గొప్ప ఇంజనీరు మాత్రమే కాదు ఒక విజనరీ ప్లానర్, సామాజిక సంస్కర్త కూడా. ఆయన చేసిన కృషి భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిభ ప్రతిఫలించింది.

నీటిపారుదల , ఆనకట్టల నిర్మాణంలో కృషి..

కృష్ణరాజసాగర డ్యామ్ (KRS Dam)..

మైసూరులోని కృష్ణరాజ సాగర ఆనకట్ట ఆయన రూపకల్పన. ఆ కాలంలో కాంక్రీటుతో ఇంత పెద్ద ఆనకట్ట నిర్మించడం ఒక అద్భుతం. ఈ ఆనకట్ట వల్ల మైసూరు, మాండ్యా, బెంగళూరు ప్రాంతాలు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు చూశాయి.

ఫ్లడ్ గేట్ల సాంకేతికత..

ఆయన అభివృద్ధి చేసిన “ఆటోమేటిక్ స్లూయిస్ గేట్లు”  ఆ కాలంలో ఒక విప్లవాత్మక ఆవిష్కారం. ఈ సాంకేతికతను గ్వాలియర్‌లోని టి గ్రా డ్యామ్, కృష్ణరాజ సాగర డ్యామ్‌లలో ఉపయోగించారు.

నీటి పారుదల పథకాలు..

 ముంబైలో 1900లో వచ్చిన ఘోర వరదల తర్వాత ఆయన రూపొందించిన డ్రైనేజి సిస్టమ్ కారణంగా భవిష్యత్‌లో ఆ నగరం వరదల బారిన పడకుండా కాపాడబడింది.

పరిశ్రమ,  ఆర్థిక రంగంలో కృషి..

మైసూరు పరిశ్రమల అభివృద్ధి

మైసూరు రాష్ట్ర దివాన్‌గా ఉన్నప్పుడు, ఆయన భద్రావతి ఐరన్ & స్టీల్ వర్క్స్ (ప్రస్తుతం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్)ను ప్రారంభించారు.

మైసూరు సాండల్‌వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.

మైసూరు విశ్వవిద్యాలయం  స్థాపనలోనూ ఆయనదే ప్రధాన పాత్ర.

ఆర్థిక సంస్కరణలు

పరిశ్రమలు, విద్య, వ్యవసాయం, సాంకేతిక రంగాల సమన్వయం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మకం.

“Planned Development” అనే కాన్సెప్ట్‌ను భారతదేశంలో ముందుగా పరిచయం చేసిన వారిలో విశ్వేశ్వరయ్య గారు ముఖ్యులు.

ఇంజనీరింగ్,  అభివృద్ధి..

ఆయన రాసిన “Planned Economy for India” (1934) పుస్తకం భారత ఆర్థిక ప్రణాళికల రూపకల్పనకు ప్రేరణనిచ్చింది.

మరో పుస్తకం **“Reconstructing India”**లో శాస్త్రసాంకేతిక అభివృద్ధి ద్వారానే దేశాన్ని బలపరచవచ్చని ఆయన వివరించారు.

ఆయనకు దక్కిన గౌరవాలు..

ఆయన ప్రతిభను గుర్తించి ప్రపంచంలోని అనేక దేశాలు సలహాదారుగా ఆహ్వానించాయి.

1955లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది.

ఇంజనీరింగ్ రంగంలో చేసిన విశేష సేవల కారణంగా ఆయనను “Father of Modern Mysore State” అని పిలుస్తారు.

ఇంజినీరింగ్ రంగ ప్రాధాన్యం

ఇంజనీర్లు ఆధునిక సమాజానికి వెన్నెముకలుగా నిలుస్తారు. రహదారులు, వంతెనలు, భవనాలు, ఆనకట్టలు – అన్నీ ఇంజనీర్ల సృజనే..

సాంకేతిక విజ్ఞానంలో భాగమైన  కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అంతరిక్ష సాంకేతికత..  ఇవన్నీ ఇంజనీర్ల ప్రతిభా ఫలితమే.

పరిశ్రమలలో భాగమైన.. విద్యుత్, రవాణా, సమాచార సాంకేతిక రంగం, వైద్య రంగంలోనూ ఇంజనీర్ల పాత్ర అపారమైనది.

సమస్యలకు పరిష్కారం చూపుతూ, కొత్త ఆలోచనలతో మానవజాతి అభివృద్ధికి దోహదపడటం ఇంజనీర్ల ముఖ్య కర్తవ్యంగా చెప్పవచ్చు.

                                   *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu